LRS | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే ఉచిత ఎల్ఆర్ఎస్ అని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు భూక్రమబద్ధీకరణ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నదని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన తర్వాత, ఆటోమెటిక్ పద్ధతిలో ఫీజు ఖరారు చేస్తున్నారని, అవి అడ్డగోలుగా ఉంటున్నాయని భూయజమానులు వాపోతున్నారు. ఎక్కువగా ఫీజు వస్తుండటంపై గ్రీవెన్స్‌సెల్‌కు కాల్ చేస్తే ఆ నంబర్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజును కంప్యూటర్ అటోమెటిక్‌గా జనరేట్ చేసిందని, తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్లో గందరగోళం నెలకొన్నది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో 1,331 గజాల ఇంటి స్థలాన్ని ఓ మహిళ కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద భూక్రమబద్ధీకరణ కోసం 2020 సంవత్సరంలో ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజుగా రూ. 28,94,48,603 చెల్లించాలని ఇటీవల లేఖ రావడంతో ఆమెకు కంగుతిన్నారు. అదే సర్వేనంబర్‌లో పక్కనే మరొకరికి రూ.14 లక్షల విలువైన 380 గజాల ప్లాట్ ఉన్నది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, రూ.5 కోట్లు ఫీజు చెల్లించాలని లేఖ అందింది.
వరంగల్ నగర పరిధిలో ఓ వైద్యుడు ఒకే సర్వే నంబర్లో 548 గజాల చొప్పున మూడు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఒక ప్లాట్‌కు రూ.90 వేలు, రెండో ప్లాట్‌కు రూ.98 వేలు, మూడో ప్లాట్‌కు రూ.2 లక్షలు ఫీజు చెల్లించాలని లేఖలు వచ్చాయి. ఒకే సర్వేనంబర్, ఒకే లేఅవుట్, ఒకే విస్తీర్ణం గల ప్లాట్లకు వేర్వేరు ఫీజు రావడంపై ఆయన ఆశ్చర్యపోతున్నారు. పెండింగ్-1, పెండింగ్-2 అని దరఖాస్తులో ఉన్నదని, ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టిన తర్వాత సర్వే చేస్తామని అధికారులు చెప్తున్నారని వాపోయారు. సర్వే చేయకముందే ఫీజు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు.
కరీంనగర్ శివారు అలుగునూరులోని 8వ డివిజన్లో ఓ వ్యక్తి ఒకే సర్వేనంబర్‌లో 183 గజాల చొప్పున మూడు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఒకేరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, గజానికి సుమారు రూ.380 చొప్పున రూ.67 వేలు చెల్లించాలని లేఖ అందింది. ఆ మొత్తం ఇంటి యజమాని చెల్లించారు. తర్వాత అంతే విస్తీర్ణంలో మరోప్లాటుకు గజానికి రూ.205 చొప్పన రూ.37 వేలు చెల్లించాలని రావడంతో కంగుతున్నారు. మొదటి ప్లాట్‌కు ఎక్కువ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినట్టు గుర్తించిన యజమాని, అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు. కంప్యూటర్ ఆటోమెటిక్‌గా ఫీజును ఖరారు చేస్తుందని, తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారని బాధితుడు తెలిపారు.