హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఒక కక్షిదారుడు (పార్టీ ఇన్ పర్సన్) హైకోర్టు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తన కేసులో స్టే ఎందుకు ఇవ్వరని, రివ్యూ పిటిషన్‌ను ఎలా కొట్టేస్తారంటూ ప్రశ్నించడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతటితో ఆగకుండా కక్షిదారుడు జడ్జి చాంబర్లోకి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు.
కేసు గురించి నేరుగా న్యాయమూర్తితో మాట్లాడరాదని, కోర్టులోనే కేసు విచారణ చేయాల్సివుంటుందని జడ్జి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కక్షిదారుడి వయసు రీత్యా కోర్టుధికరణ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కేసును మరొక న్యాయమూర్తి విచారణ చేసేందుకు వీలుగా కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేశారు.