పరకాల, మే 7 : పరకాల కాంగ్రెస్‌లో వర్గపోరు రోజురోజుకూ ముదురుతున్నది. మంత్రి కొండా సురేఖ వర్గం వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి వర్గం మధ్య వాగ్వాదాలు జరిగి రోడ్డెక్కి కేసులు నమోదైన ఘటనలు ఉండగా తాజాగా మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన కాంగ్రె స్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి సురేఖ ఎమ్మెల్యే రేవూరికి ఫోన్లో ధమ్కీ ఇవ్వడంపై చర్చ జరుగుతున్నది. ‘గీసుగొండ నా సొంత మండలం.. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి చేరిక నాకు తెలియాలి. నాకు తెలియకుండా ఏమైనా జరిగినా ఊరుకునేది లేదు. ఇటీవల మేము పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పిన భరత్‌ను పార్టీలో క్రియాశీలకంగా ఉంచుకోవాలి.
ఇప్పుడు మాకు నచ్చని వారిని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. ఎంపీపీ సౌజన్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఊసరవెల్లులు. వారు పార్టీని నాశనం చేశారు. వారిని సంకలో పెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు. పార్టీకి నష్టం చేస్తేనే రాజ్‌కుమార్‌ను పార్టీ నుంచి పంపించాం. రాజ్‌కుమార్‌ను పార్టీలోకి తీసుకుని లీడర్‌ను చేస్తాననడం మమ్మల్ని అవమానించినట్టే. ఓడిపోయే మిమ్మల్ని పరకాలలో గెలిపించినం. మేము చెప్పినట్టు వినాలి’ అంటూ సురేఖ ధమ్కీ ఇచ్చారు.
గట్టిగానే సమాధానమిచ్చిన రేవూరి..
ఎమ్మెల్యే రేవూరి ఫోన్లోనే మంత్రి సురేఖకు గట్టిగానే సమాధానమిచ్చారు. తనకు భరత్ పద్ధతి నచ్చలేదని, అందుకే వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. నాకు ధమ్కీ ఇస్తున్నావా? అని కొండాకు రేవూరి ఎదురుతిరిగారు. మీరు మాట్లాడే విధానం బాగాలేదు. మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తున్నదా? రికార్డు కావాలంటే పంపిస్తా.. ఏం మాట్లాడుతున్నరో మీరే ఆలోచించుకోండి. మినిస్టర్ గారు ఒక్క విషయం నేను ఫోన్ పెట్టేయడం సంస్కారం అనిపిస్తలేదు. అర్థం చేసుకోండి’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.