హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి నెమ్మదించిన పారిశ్రామికరంగం, పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం తో మరింత సందిగ్ధంలో పడింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన టీడీపీ అధికారంలోకి వస్తుండటంతో సహజంగానే ఆ రా ష్ర్టానికి కేంద్రం నుంచి మరింత సహకారం ఉంటుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం పారిశ్రామికంగా తిరుగులేని స్థానానికి ఎదగడంతో ఏపీలో ప్రభుత్వం మారినా ఇప్పటికిప్పుడు మన రాష్ర్టానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని కొందరు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల రాకతో హైదరాబాద్ దేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత పెట్టుబడుల రాక పూర్తిగా నిలిచిపోవడమే కాకుండా పలు కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాయి.
కరెంటు కోతలు మొదలుకావడం, గతం లో కొనసాగిన పథకాలు నిలిచిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ల భించకపోవడంతో పారిశ్రామికరంగం సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఎంఎస్ఎంఈ లు సహా వివిధ రంగాలకు కొత్త పాలసీలు తె స్తామని, ఫార్మాసిటీని రద్దుచేసి దాని స్థానంలో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటుచేస్తామని చెప్పినప్పటికీ వీటిపై ఎటువంటి పురోగతి లేకపోవడం పారిశ్రామికరంగాన్ని అయోమయంలో పడేసింది. దీంతో చిన్నా చితకా ఎంఎస్ఎంఈలు ఏర్పాటుచేసుకొని సొంతకాళ్లపై నిలబడాలనుకునే యువత కూడా ఏమి చేయాలో అర్థంకాక యూనిట్లు పెట్టేందుకు ధైర్యం చేయడం లేదు. పరిశ్రమల స్థాపన కోసం గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే భూములు కేటాయించగా, ఆరు నెలలుగా ఈ ప్రక్రియంతా నిలిచిపోయింది. గతంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిరంతరం ప్రయత్నించగా, ప్రస్తుతం పరిశ్రమలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీ అధికార పగ్గాలు చేపడుతున్నది. టీడీపీ సర్కారు ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు విశేషంగా కృషి చేస్తుందనే ప్రచారం ఉన్నది. రాష్ర్టానికి శాశ్వత రాజధానిని ఏర్పాటుచేయడంతోపాటు స్థానిక ఉత్పత్తులకు అనుబంధంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రానున్న ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆశాభావం కొందరు పారిశ్రామికవర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. దీనికితోడు కేంద్రంలో ఏర్పడనున్న ఏన్డీఏ సర్కారు ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా సాధించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
ఈ అంశాల కారణంగా ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యే ఆస్కారం ఉంటుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలోని కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు రాష్ట్ర పారిశ్రామికరంగంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదని అంటున్నారు. హైదరాబాద్ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్నదని, దేశంలోని ఏ నగరానికి లేని అనేక అనుకూలతలు హైదరాబాద్కు ఉన్నాయని ఉదహరిస్తున్నారు.
ముఖ్యంగా ఐటీ రంగంలో బెంగుళూరును ఢీకొనే స్థాయికి చేరుకోగా, ఫార్మారంగానికి రాజధానిగా ఎదిగిందని, ఆయా రంగాల ఎకోసిస్టం బలంగా ఉన్నందు న మన రాష్ట్ర పారిశ్రామికరంగానికి వచ్చే ము ప్పు ఏమీ ఉండకపోవచ్చని అంటున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాల్లో ఎంతో ప్రాచు ర్యం లభించి అనేక కంపెనీలు ఇప్పటికే ఇక్కడ ఏర్పాటయ్యాయని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే కొత్తగా వచ్చే పెట్టుబడులకు హైదరాబాదే మొదటి ప్రాధాన్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక రంగంపై ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తదితర అంశాలపైనే రాష్ట్రంలోని పారిశ్రామిక రంగ భవితవ్యం ఆధారపడి ఉంటుందని, స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని కొందరు పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.