ఇది 2023 మే 20నాటి చిత్రం. జలకళతో మత్తడి దుంకుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు చెక్ డ్యామ్. కేసీఆర్ పాలనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల-గుమ్మడవెల్లి గ్రామాల మధ్య చలివాగు మీద చెక్‌డ్యాం నిర్మించారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చే జలాలతో చెరువులు, చలివాగు, మానేరు వాగు నిత్యం కళకళలాడుతుండేవి. రెండు పంటలకు నీరు సరిపోవడంతోపాటు మే నెలలో సైతం వాగులు ప్రవహించి పశుపక్ష్యాదులు, మత్స్యకారులకు జీవనాధారంగా ఉండేవి. పిచ్చి మొక్కలతో నిండిన డీబీఎం- 38 కెనాల్‌ను అప్పటి స్పీకర్ మధుసూదనాచారి దగ్గర ఉండి మరమ్మతు చేయించి, మండలంలోని చివరి గ్రామమైన ద్వారకపేట చివరి పంటపొలాల వరకు నీటి అందించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు చెక్ డ్యామ్ ఇప్పుడు పూర్తిగా వట్టిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడంతో ఫిబ్రవరిలోనే మానేరు వాగు, చలివాగు ఎండిపోయాయి. సాగునీళ్లు అందక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. నీటిని తీసుకురావడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో డీబీఎం- 38 కెనాల్ మళ్లీ పిచ్చి మొక్కలు పెరిగి, నీరు కిందికి ప్రవహించలేని దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం చలివాగు పూర్తిగా ఎండిపోయిందని, నీటి విడుదల చేసినా పైన ఉన్న రైతులే వాడుకుంటున్నారని, టేకుమట్ల మండలానికి నీరు చేరే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
– టేకుమట్ల