హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ‘వరి వద్దంటే నీకు ఉరే. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధాన్యం మొత్తాన్ని సేకరించడమే కాదు, గిట్టుబాటు ధరకు అదనంగా రూ.500 బోనస్ కూడా ఇస్తాం. వడ్లు.. బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలో చేసి చూపిస్తాం’ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి అనేక సార్లు చేసిన వ్యాఖ్యలివి! కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని నాటి సీఎం కేసీఆర్ చెప్తే రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం కొనకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే గద్దెపై కూర్చునే అర్హతే లేదంటూ మాట్లాడారు. అంతేకాదు తమకు రూ.10 వేల కోట్లు ఇస్తే చివరి గింజ వరకూ కొనుగోలు చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. రూ.10 వేల కోట్లు కాదు.. ప్రభుత్వమే రేవంత్‌రెడ్డి చేతికి వచ్చింది. రెండు నెలల నుంచి వడ్లు కల్లాల్లో మగ్గుతున్నాయి.
రాశి పడ్డ వడ్లు అకాల వర్షాలకు తడుస్తున్నాయి. బీట్లకు చేరిన వడ్లకు కాంటాపెట్టే నాథుడు లేడు,. అధికారం లేనప్పుడు వడ్లను విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు లాభసాటి వ్యవసాయం అంటే ఏమిటో చూపిస్తామని బీరాలు పలికిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాత్రం ‘వడ్లు కొనాల్సింది ఎవరు? కొనకుండా తప్పించుకుంటున్నది ఎవరు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేయడం లేదు ’ అంటూ తన వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీదికి నెట్టేశారు. నాడు కేసీఆర్ ఇదే విషయం చెప్తే తాను ఏమేం విమర్శలు చేశాడో ఆయన మర్చిపోయారు. రేవంత్‌రెడ్డి శనివారం ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు, బీజేపీ నేతల బస్సుయాత్రపై స్పందిస్తూ.. కేంద్రం ఎమ్మెస్పీ ప్రకటించి వదిలేస్తే, తమ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ‘మీ ప్రభుత్వం కొన్నది ఎం త? మేం కొంటున్నది ఎంత?’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. తాము వరి, జొన్న, మొకజొన్న కొనుగోలు చేస్తున్నామని, మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి బీజేపీ నేతల ఇండ్ల ముందు పోసిపోతామని హెచ్చరించారు. రూ.10 వేల కోట్లు ఇస్తే ధాన్యం కొని విదేశాలకు ఎగుమతి చేస్తామని నాడు చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పు డు కేంద్రమే కొనాలని అనడంగమనార్హం.
మోటర్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్తు నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ఒకవేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్తు కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకొంటుందా?’ అంటూ సవాల్ చేశారు. రైతు డిసమ్పై జరుగుతున్న ఆందోళనలు, చర్చను పక్కదారి పట్టించేందుకే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేందుకే రైతు డిసమ్ అని, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు కనెక్షన్లను ఈ డిస్కమ్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడిపై ఓవర్గం మీడియా చేస్తున్న దా డి ప్రస్తావనకు రాగా.. మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు మంచి మిత్రుడని, తమ ఇద్దరి కాంబినేషన్లోనే 2029 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని సీఎం చెప్పా రు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన కేంద్ర మంత్రి కూడా కావొచ్చని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మహేశ్‌కుమార్ డ్కు మంత్రి పదవి వచ్చే ప్రసక్తే లేదని రేవంత్‌రెడ్డి చెప్పారంటూ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. తమ కాంబినేషన్లోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం ద్వారా ఆయనను పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగిస్తాం తప్ప క్యాబినెట్లోకి తీసుకోనని సీఎం అన్నట్టేనని విశ్లేషిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ మధ్య మొదటి నుంచీ మంచి సఖ్యత ఉండేదని, మహేశ్‌గౌడ్ బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటి నుంచే విభేదాలు తలెత్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. పదవి కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తుండగా ఆయనను అడ్డుకోవటానికే సీఎం అనుకూల మీడియా దాడి చేస్తున్నదని కాంగ్రెస్ శ్రేణులే పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అగ్రనేత ఫోన్ చేసి చీవాట్లు పెట్టడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే చిట్‌చాట్ పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిషరించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని, తమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరు తూ లేఖ రాశానని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ లేఖ ను మోదీకి కూడా పంపానని, కానీ మహారాష్ట్ర సీఎం స్పందించడం లేదని తెలిపారు. పోలవరం కోసం 7 మండలాలు ఇచ్చిన మోదీ, తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించలేరా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో జరుగుతున్న చర్చపై సీఎం స్పందిస్తూ.. ఎన్టీఆర్‌ను కులం, ప్రాంతం తో పోల్చడం బుద్ధిలేనితనమని, జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందర లేదని చెప్పారు.