హైదరాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఏపీ చేపట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఇంకా ఎలాంటి అనుమతులివ్వలేదని కేంద్ర జలసంఘం వెల్లడించింది. ఈమేరకు తెలంగాణ సర్కారుకు గురువారం లేఖ రాసింది. బనకచర్ల డీపీఆర్ కోసం గత అక్టోబర్‌లో టెండర్లు పిలిచిన నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై సీడబ్ల్యూసీ తాజాగా స్పందించింది.
బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులుగానీ, సూత్రప్రాయ ఆమోదం గానీ తెలుపలేదని స్పష్టంచేసింది. అంతర్రాష్ట్ర జల వివాదాల అంశాలకు అనుగుణంగా కంప్లయన్స్ రిపోర్టును ఇవ్వాలని ఏపీకి సూచించామని సీడబ్ల్యూసీ వెల్లడించింది. ఏపీ పంపిన హైడ్రాలజీ లెకలను పరిశీలిస్తున్నామని కూడా తెలిపింది. ఇంకా అనుమతులివ్వలేదని వివరించింది. ఏపీ సర్కారు బనకచర్లకు బదులు నల్లమలసాగర్ లింక్ డీపీఆర్‌కు టెండర్లు పిలువడం గమనార్హం.