హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 53 టెలీమానస్ కేంద్రాలు మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారికి సాయం అందిస్తున్నాయని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర చర్చలో పాల్గొన్నారు. ‘మానసిక ఆరోగ్య రుగ్మతలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రత్యేకించి గ్రామీణ, చిన్న పట్టణాలలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈ విషయంలో ఆశావరర్స్, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారా? ఈ సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
అనంతరం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా, సహాయమంత్రి ప్రతాపరావు గణపత్రావు జాదవ్ బదులిచ్చారు. ‘ఆయుష్మాన్ భారత్’ లక్షకుపైగా కేంద్రాలకు విస్తృతం చేశామని, 30 ఏండ్లకు పైబడినవారికి షుగర్, బీపీ, దంత, మానసిక, క్యాన్సర్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య రుగ్మతల నివారణకు 2022 అక్టోబర్ 10న ‘నేషనల్ టెలీమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’ ప్రారంభించామని తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని 53 సహాయక కేంద్రాలను(టెలీమానస్ సెల్స్) ఏర్పాటు చేశామని వివరించారు. మానసిక రుగ్మతతో ఇబ్బంది పడేవారిని మొదట ఏఎన్ఎంలు, ఆశావరర్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సైకియాట్రిస్ట్తో సరైన అవగాహన కల్పిస్తున్నారని వివరించారు.