హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): నక్సలైట్లు (Maoists) లొంగు‘బాట’ పట్టారు. పేద, పీడిత, అణగారిన వర్గాలను దోపిడీ వర్గం నుంచి కాపాడేందుకు, అడవుల్లోని అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ల బారి నుంచి కాపాడేందుకు ఆయుధాలు చేతబట్టి అడవులబాట పట్టిన అన్నలు.. ఒక్కొక్కరిగా నేల రాలుతూ గత్యంతరం లేక ప్రాణాలు కాపాడుకోవడానికి వనవాసం వీడుతున్నారు. స్రవంతిలా సాగిన వారి పోరుమార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. లొంగిపోవడం.. లేదా మరణించడం మాత్రమే ప్రస్తుతం మావోల ముందు ఉన్న ఐచ్ఛికాలు.
2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని భారత దేశం నుండి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దీంతో 2025లో లొంగుబాట్లు, అదే స్థాయిలో ఎన్కౌంటర్లు భారీగా చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు మావోయిస్టు ఉద్యమ అంతిమ దశను సూచిస్తుంది. 2013లో దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో వ్యాపించిన మావోయిజం.. 2025 నాటికి కేవలం 11 జిల్లాలకే పరిమితమైంది. ప్రస్తుతం వారు కేవలం మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. యాక్టివ్ క్యాడర్ సంఖ్య 2013లో 6,500-9,500 మధ్య ఉండగా, 2025 ప్రభుత్వ నివేదికల ప్రకారం కేవలం 600 మందికి మాత్రమే పరిమితమైంది. దీంతో కేవలం 10శాతం మంది మాత్రమే అడవుల్లో ఉన్నారని పోలీసు నివేదికలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, కేరళ వంటి రాష్ర్టాల్లో గత 15 ఏండ్లలో భారీగా లొంగుబాట్లు కనిపించాయి. 2000 నుండి 2025 వరకు మొత్తం లొంగుబాట్ల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 15,163గా నమోదైంది. గడిచిన ఐదేండ్లలో లొంగుబాట్లలో భారీ పెరుగుదల నమోదైంది. గడిచిన పదేండ్లలో మావోయిస్టులు, సానుభూతి పరులు, కొరియర్లు, కోవర్టులు కలిపి మొత్తం కలిపి 10 వేల మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు.
తాజా నివేదికల ప్రకారం.. 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోగా.. 881 మంది లొంగిపోయారు. అలాగే ఈ ఏడాది పది నెలల్లో 312 మందికిపైగా ఎన్కౌంటర్లలో చనిపోగా.. 1,639 మంది లొంగిపోయారు. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజు సహా 8 మంది పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. తెలంగాణలో ఈ ఏడాది లొంగిపోయిన వారు 412 మంది ఉన్నారు. దీంతో అడవుల్లో తెలంగాణ బిడ్డలు కేవలం 67 మంది వనవాసం చేస్తున్నారని, వారు కూడా లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.