CGHS | హైదరాబాద్, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) వైద్య సేవలపై కేంద్రం కోతలు, పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించే సీజీహెచ్ఎస్ను ఆయుష్మాన్ భారత్కు లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా లింక్ చేయడం ద్వారా తమకు అందాల్సిన వైద్య సేవలు తగ్గిపోయే అవకాశం ఉందని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తున్నారు.
ఉద్యోగులు సీజీహెచ్ఎస్ కోసం ప్రతి నెల తమ జీతం నుంచి చందా చెల్లిస్తున్నారు. పెన్షనర్లు కూడా రిటైర్ అయిన తర్వాత సీజీహెచ్ఎస్ సేవలను పొందేందుకు 120 నెలల సబ్స్క్రిప్షన్ చెల్లిస్తారు. తాము సీజీహెచ్ఎస్ కోసం చందా చెల్లిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆయుష్మాన్ భారత్కు లింక్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించే సీజీహెచ్ఎస్ వెల్నెస్ కేంద్రాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. వెల్నెస్ సెంటర్లను ప్రైవేటీకరణ చేస్తే సేవలు సరిగ్గా అందవనే భావనతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. కాగా, సీజీహెచ్ఎస్ ఎన్ప్యానల్డ్ దవాఖానల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత చికిత్స అందడం లేదు. చికిత్స పొందుతున్న వారి నుంచి దవాఖానలు అదనంగా డబ్బులు తీసుకుంటున్నాయి. ఇది కూడా పెన్షనర్లకు భారంగా మారింది.
వైద్య సేవల విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్న సీజీహెచ్ఎస్ ఏడీ కార్యాలయాల ఎదుట నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్(ఎన్సీసీపీఏ) ఆధ్వర్యంలో పెన్షనర్లు మహా ధర్నాలు నిర్వహించారు. రైల్వే, రక్షణ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, తదితర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ధర్నాల్లో పాల్గొన్నారు.