హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ర్టాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాలకు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలనే కేంద్ర ప్రభుత్వం హఠాత్ నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
కరోనా సమయంలో తప్ప మునుపెన్నుడూ ఇలా ముందస్తుగా పంపిణీ చేయలేదు. పాకిస్థాన్‌తో యుద్ధం సమస్య సమిసిపోయింది, కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణం నెలకొన్నది. అయినప్పటికీ మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలన్న నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం, విపత్కర సమయంలో మాత్రమే ప్రజలకు ఆహార కొరత లేకుండా ఉండేందుకు మందుస్తు పంపిణీ నిర్ణయం తీసుకుంటారు.అయితే రాబోయే వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం పేర్కొన్నది.
ఆగస్టు నెల వరకు లబ్ధిదారులకు మూ డు నెలల బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశించింది. రాష్ర్టాలకు కేటాయించిన బియ్యాన్ని ముందు గా లిఫ్ట్ చేసి ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ గోదాముల్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆ యా రీజియన్ల మేనేజర్లకు సూచించింది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ర్టా లు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నా యి. తెలంగాణలో మాత్రం జూన్ నెలలో పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.