కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల పోస్టులు భర్తీ చేస్తాం – జూన్ 14న ప్రధాని మోదీ చేసిన ప్రకటన. ఇప్పటివరకు కనీసం ఖాళీల గుర్తింపు కూడా పూర్తి కాలేదు.
రాష్ట్రంలో 91వేల పోస్టులను భర్తీ చేస్తాం. 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేస్తాం, 11,103 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం – మార్చి 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఆ తర్వాత రెండు వారాల నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
యువత పట్ల, నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి.. మోదీ ప్రభుత్వానికి ఉన్న ‘ఉత్త’ శుద్ధికి ఇదే నిదర్శనం. ఆర్భాటపు ప్రకటనలే తప్ప మూడు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, శిక్షణశాఖ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీచేసింది. ఆయా విభాగాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, స్వతంత్ర వ్యవస్థల్లోని ఖాళీల వివరాలను ఈ నెల 15లోగా ‘వేకెన్సీ స్టేటస్ పోర్టల్’లో అప్డేట్ చేయాలని సూచించింది.
దీనిని బట్టి మోదీ ప్రకటించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం ఖాళీల గుర్తింపు కూడా పూర్తి చేయలేదని స్పష్టంఅవుతున్నది. ఖాళీలను గుర్తించి, నివేదికను ఆర్థిక శాఖకు పంపించాల్సి ఉంటుంది. పరిశీలన అనంతరం అనుమతులు వస్తే.. ఆయా శాఖలు నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఆ తర్వాతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఇది ఇప్పట్లో అయ్యేది కాదని, నోటిఫికేషన్లు వచ్చేసరికి కనీసం ఏడాది పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో శరవేగంగా..
రాష్ట్రంలో 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేస్తామని, 11,103 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ప్రకటించిన రెండు వారాల నుంచే కార్యాచరణ మొదలైంది. మార్చి 23న తొలివిడుతగా ఆర్థిక శాఖ 30,453 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఏప్రిల్ 25న రాష్ట్రంలో మొదటి విడుత నోటిఫికేషన్ విడుదలైంది. సుమారు 17 వేల పోలీస్ ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది.వీటి రాత పరీక్ష సైతం పూర్తయింది.
రాష్ట్ర ఆర్థికశాఖ ఇప్పటివరకు ఏడు విడుతల్లో 52,460 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ప్రకటించిన మొత్తం ఖాళీల్లో ఇది 65 శాతం. టీఎస్పీఎస్సీతోపాటు డీఎస్సీ, ఇతర రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా 21,732 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో గ్రూప్-1 కూడా ఉన్నది. నిరుద్యోగుల జీవితాలను బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఉత్తుత్తి హామీలు, ప్రకటనలకే పరిమితం అయ్యారని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఇదీ సంగతి
మోదీ ప్రకటన: జూన్ 14
సంఖ్య: 10 లక్షలు
ప్రస్తుతం: ఇప్పటికీ పూర్తికాని ఖాళీల గుర్తింపు
సీఎం కేసీఆర్ ప్రకటన: మార్చి 9
సంఖ్య: 91,142
ప్రస్తుతం: వివిధ దశల్లో 21,732 పోస్టుల భర్తీ