CEC | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 3 రాష్ర్టానికి రానున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ సారథ్యంలోని 17 మంది అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్‌కృష్ణాలో బస చేస్తుంది. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశమవుతుంది.
సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తున్నది. రాష్ర్టానికి రానున్న ఎన్నికల అధికారుల బృందంలో ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీశ్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అజయ్ భాడూ, హిర్దేశ్‌కుమార్, ఆర్కే గుప్తా, మనోజ్‌కుమార్ సాహూ తదితరులు ఉన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశమవుతారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ ఈ బృందం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. పర్యటన చివరల్లో పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనుంది.