
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కొత్త రాష్ట్రం, పైగా దక్షిణాదికి చెందిన తెలంగాణ.. వరిధాన్యం ఉత్పత్తిలో ఉత్తరాది రాష్ర్టాలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోవడాన్ని కేంద్రం జీర్ణించుకోలేక పోతున్నదని ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎఫ్‌సీఐ మాజీ డైరెక్టర్ సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణను ఏ విధంగానైనా ఇబ్బంది పాల్జేయాలన్న రాజకీయ కుట్రకు ఇక్కడి రైతన్నను బలిపశువును చేస్తున్నదని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపు కోసం తెలంగాణ నుంచి బియ్యం సేకరించబోమంటూ కేంద్రం చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. రైతు చట్టాలపై ఎలాగైతే కేంద్రం వెనక్కు మళ్లిందో.. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఆయన ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
బాధ్యత నుంచి తప్పుకుంటానంటే కుదరదు
యాసంగిలో పండించే వరి ధాన్యం కొనబోమని కేంద్రం తెగేసి చెప్పినంత మాత్రాన సరిపోదు. కొనాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా? బాధ్యత నుంచి తప్పుకొంటానంటే కుదురుతుందా? కేంద్రం అలా అంటే వరి పండించే రైతు పరిస్థితి ఏమి కావాలి? మీ రాష్ట్రం, మీ ధాన్యం, ఏమి చేసుకొంటారో మీ ఇష్టమని చేతులెలా దులుపుకోగలదు? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏడేండ్లుగా ధాన్యం సేకరణకు, రేషన్ బియ్యంపై సబ్సిడీ కోసం 3 వేల కోట్లు భరిస్తూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఇంత చేస్తుంటే మరి కేంద్రం ఏమి చేస్తుంది? ఇంతకాలం ఒక విధానాన్ని అనుసరిస్తూ వచ్చిన కేంద్రం.. సడన్‌గా ధాన్యం కొనను అంటే ఎలా? కేంద్రం ఎలా కొనదో.. ఎట్ల కొనదో చూడాలి? వరి ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనలో తప్పు లేదు.
కేంద్రం వింత వైఖరి
తెలంగాణ నుంచే కాదు, ఏ రాష్ట్రం నుంచి కూడా తాము యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనబోమన్నది కేంద్రం వాదన. అంటే కేంద్రం పరోక్షంగా చెప్పేది పంజాబ్, హర్యానా రాష్ర్టాల నుంచి కూడా యాసంగిలో పండించే వరి ధాన్యం గురించి. యాసంగిలో వరి ధాన్యాన్ని కొనకపోతే పంజాబ్, హర్యానాలకు నష్టమేమీ లేదు. అక్కడ వారు యాసంగిలో వరి వేయరు. ఈ రాష్ర్టాలు వానకాలంలో వరి పండించి, యాసంగిలో గోధుములు పండిస్తాయి కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణలో అలా కాదు.. వానకాలంలో, యాసంగిలో పండించేది వరి ధాన్యాన్నే. వరి పండించే రాష్ర్టాలైన పంజాబ్, హర్యానాలతో తెలంగాణ రాష్ర్టానికి లంకె పెట్టలేరు. ఆ రాష్ర్టాల్లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి మండీలు కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తాయి. మిల్లర్ల నుంచి వందకు వందశాతం ఎఫ్‌సీఐ కొంటుంది. తెలంగాణలో అలా కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి పౌరసరఫరాలశాఖ, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తుంది. తెలంగాణ సర్కారు 6,735 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోళ్లకు రూ.20 వేల కోట్ల పెట్టుబడిని సమకూర్చింది. రైతుల నుంచి ప్రభుత్వమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లకు కిలోన్నర వరి ధాన్యాన్ని ఇస్తే కిలో బియ్యం మాత్రమే వస్తుంది. ఇందులో అరకిలో ధాన్యాన్ని తరుగుగా పరిగణిస్తారు. తాలు, నూక, తవుడు కలిపి కిలో వరి ధాన్యానికి అరకిలో తరుగుగా పరిగణిస్తారు.
మరి కేంద్రం చేస్తున్నదేంటి?
రైతుల నుంచి వరి మద్దతు ధర ప్రకారం క్వింటాల్‌కు రూ.1960 చొప్పున క్వింటాల్నర వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,940 హెచ్చించి కొంటే, ఎఫ్‌సీఐ కిలో బియ్యానికి ఇచ్చేది రూ.33 మాత్రమే. ఎఫ్‌సీఐ నుంచి కొన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీకి ట్రాన్స్‌పోర్టు, హమాలీ చార్జీల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు భరిస్తుంది. కిలో బియ్యంపై రెండు రూపాయలు భరించి పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1500 కోట్ల వరకు భరించాల్సి వస్తుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు, రేషన్ బియ్యంపై ఏటా 3 వేల కోట్లు భరిస్తూ వచ్చినా, కేంద్రం వరి కొనబోమంటే ఎలా? ఈ విషయంలో కేంద్రం వైఖరి సరైనది కాదు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సిందే, రైతుకు అండగా నిలవాల్సిందే.
యాసంగి బియ్యానికి డిమాండ్ లేదనడం తప్పు
యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని (ఉప్పుడు బియ్యం) ఎవరూ తినరు గనుక కొనబోమని కేంద్రం వితండ వాదన చేస్తున్నది. ఉప్పుడు బియ్యానికి తమిళనాడు, కేరళ, బంగ్లాదేశ్, మలేషియాల నుంచి 30 లక్షల టన్నుల డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వారు తినేదే ఉప్పుడు బియ్యం. ఇప్పటికే మా వద్ద తగినంత స్టాక్ ఉందని కేంద్రం అంటున్నది. అలాంటప్పుడు బఫర్ స్టాక్గానైనా యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కదా!