Siddaramaiah : కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) ప్రమాణ స్వీకారానికి ముందు రోజే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య (Siddaramaiah)కు కీలక పదవిని కట్టబెట్టింది. దేశ రాజకీయాలపై అయిష్టతతో రాజ్య సభ సీటు వద్దనుకున్న ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)లో చోటు కల్పించింది.
సీఎం కుర్చీ దిగనంటే దిగనంటూ మొండిపట్టు పట్టిన సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కీలక హోదాలో కొనసాగనున్నారు. రాజ్య సభ ఆఫర్‌ను తిరస్కరించిన ఆయన చిన్నబుచ్చుకోకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకుంది అధిష్ఠానం. సిద్ధరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించాం. జూన్ 2 నుంచి ఆయన సీడబ్ల్యూసీలో సభ్యుడు అని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) వెల్లడించారు. తద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఇకనుంచి సభ్యుడిగా సిద్ధరామయ్య భాగం కానున్నారు.
The Congress President has appointed former Karnataka CM Siddaramaiah as a Member of the Congress Working Committee. pic.twitter.com/XJe5qI1Q8N
— ANI (@ANI) June 2, 2026
శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు సంపూర్ణ మద్దతుతో జరిగేలా చూసేందుకు సిద్ధరామయ్యను సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారని సమాచారం. సీఎంగా శివకుమార్‌తో పాటు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకరం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.