హైదరాబాద్, నవంబర్ 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొనసాగుతున్న ఆరుగురు కేంద్ర సర్వీస్ అధికారుల బదిలీ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ కేసులో వెలువరించిన తీర్పునే అమలు చేయాలని కేంద్రం హైకోర్టును కోరింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ కుమార్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ, తెలంగాణలకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర సర్వీస్ అధికారులను విభజించారు. అయితే ఆ సిఫార్సులను పలువురు కేంద్ర సర్వీస్ అధికారులు క్యాట్‌లో సవాల్ చేసి మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్రం హైకోర్టులో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. వీటిని బుధవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. డీజీపీ అంజనీకుమార్, సహా ఆరుగురు కేంద్ర సర్వీస్ అధికారులు రోనాల్డ్ రాస్, జే అనంతరాము, ఎస్ఎస్ రావత్, ఆమ్రపాలి, అఖిలాస్బిస్లకు సోమేశ్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పును వర్తింపజేయాలని కోరారు. మిగిలిన పిటిషన్లలో మాత్రం వ్యక్తిగతమైన అంశాలు ఉన్నందున వాటిపై వాదనలు వినిపిస్తామన్నారు. స్పందించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నామని, అప్పటిలోగా ప్రతివాదులు తమ వాదనలను లిఖితపూర్వకంగా నివేదించాలని ఆదేశించింది.