వరంగల్ చౌరస్తా, జూలై 25: పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం తీరు. డొల్లతనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో వరంగల్ కేఎంసీలో ఆరు అంతస్తుల భవనంలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో రోగుల ప్రాణాలకు భద్రత కరువయ్యింది. మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో రేడియాలజీ విభాగంలో అకస్మాత్తుగా సీలింగ్ కూలిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో సీలింగ్ కూలడంతో వైద్యపరీక్షల కోసం వచ్చిన రోగులు భయాందోళనకు గురయ్యారు.
రేడియాలజీ విభాగానికి నిత్యం పరీక్షల కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఓపీ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాధారణ రోజుల్లో ఈ ఘటన జరిగి ఉంటే చాలా మంది రోగులు గాయాలపాలయ్యే వారని దవాఖాన సిబ్బంది చెప్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలోనే నాలుగో అంతస్తులో మొదటి సారి సీలింగ్ కూలిన ఘటన మరువక ముందే.. తాజాగా గ్రౌండ్ ఫ్లోర్లోని రేడియాలజీ విభాగంలో రెండోసారి సీలింగ్ కూలింది. దీంతో రోగులు, అటెండెంట్లు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.