కాశీబుగ్గ, డిసెంబర్ 25 : పత్తి కొనుగోళ్లలో నిబంధనలు సవరించినట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతులకు కీలక సమాచారం అందించింది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి విక్రయించే విధానంలో నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఎకరానికి ఏడు క్వింటాళ్ల చొప్పున పత్తి కొనుగోలు చేసేవారు.
గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం యాప్లో నమోదు చేసిన మొత్తం పత్తి పరిమాణానికి మరో 5 క్వింటాళ్లు అదనంగా కొనుగోలుకు అనుమతి ఉంటుందని సీసీఐ అధికారులు పేర్కొన్నారు. దీనికి మించి ఉన్న పత్తిని కొనుగోలు చేయబోమని తెలిపారు.
రైతులు స్లాట్ బుకింగ్ సమయంలో తమ వద్ద ఉన్న పత్తి పరిమాణాన్ని సరిగ్గా నమోదు చేసుకోవాలని సూచించారు. సరైన వివరాలు నమోదు చేస్తేనే కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని సీసీఐ అధికారులు కోరారు.