వేములవాడ, మార్చి 14: మున్నూరు కాపు సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య విమర్శించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసినట్టు శుక్రవారం ఆయన వెల్లడించారు. గతేడాది మార్చి 14న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాపులను రాష్ట్ర సచివాలయానికి పిలిచి కార్పొరేషన్ ప్రకటించి నేటికి ఏడాది పూర్తయిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కార్పొరేషన్ ప్రకటించిన నేపథ్యంలో కాపు సమాజం మొత్తం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి ధన్యవాదాలు కూడా తెలిపినట్టు చెప్పారు. కాపు కార్పొరేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత అన్యాయం చేస్తుందని ఊహించలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో బాలబాలికల వసతి గృహాల కోసం రెండెకరాల స్థలం కేటాయిస్తామని ప్రత్యేక జీవో కూడా ఇచ్చిన విషయానిన గుర్తుచేశారు.
ఇప్పుడు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్నూరు కాపులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయారని మండిపడ్డారు. జనాభా ప్రకారం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న కాపులను కులగణన సర్వేలో ఐదో స్థానంలోకి నెట్టేశారని విమర్శించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాపులకు నామినేట్ పదవులు అడిగే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పథకం ప్రకారమే కాపులకు ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదని, కాపు కార్పొరేషన్ పదవి కూడా అడిగే అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను ఓట్లను అడిగే హకును కోల్పోతారని ఆ లేఖలో స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.