హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లుల భారం మాజీ సర్పంచ్‌లకు శాపంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది మాజీ ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సర్కారుకు అనేకసార్లు మొరపెట్టుకున్నా, శాంతియుతంగా నిరసనలు తెలిపినా కనికరించడంలేదు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు హఠన్మారణానికి గురి కాగా, మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే 691 కోట్ల పెండింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ గద్దెనెక్కి పద్నాలుగు నెలలు దాటినా ఆ ఊసెత్తడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు సైతం ఈ విషయాన్ని దాటవేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించినా త్వరలోనే చెల్లిస్తామని చెప్పింది. కేవలం కేంద్రం అందించే ఉపాధి హామీ బిల్లులు చెల్లించి చేతులు దులుపుకున్నది. కానీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నయాపైసాకూడా చెల్లించలేదని మాజీ సర్పంచ్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల భారం పెరిగి ఇప్పటికే పలువురు మాజీ సర్పంచులు ప్రాణాలు విడిచారు. నిరు డు నవంబర్‌లో నిర్మల్ జిల్లా పెంబి గ్రామ సర్పంచ్ పూర్ణచందర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండికి చెందిన శంకర్‌నాయక్ అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. చికిత్సకు డబ్బు లేకపోవడంతో అక్కడే తనువు చాలించాడు. యాదా ద్రి భువనగిరి జిల్లా కుంట్లగూడెం మాజీ సర్పంచ్ మల్యాల గోపాల్ గుండెపోటుకు గురయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్లమద్దికి చెందిన ఏనుగుల కేశవరావు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. మూడురోజుల క్రితం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీంపూర్‌కు చెందిన దళిత మాజీ సర్పంచ్ వెంకటప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తం గా 14 నెలల్లో సుమారు 25 మందికి పైగా మాజీ సర్పంచులు మరణించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం, జేఏసీ నాయకులు కోరుతున్నారు.