ములుగురూరల్, నవంబర్17 : డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తిని దారుణంగా చంపిన ఘటన ములుగు మండలం లాలాయిగూడెంలో సోమవారం జరిగింది. ఇంటి ముందు వ్యక్తిని సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టి చంపడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ములుగు సీఐ సురేశ్, ఎస్సై వెంకటేశ్వరరావు క్లూస్‌టీమ్‌తో చేరుకొని హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు నిర్వహించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని ములుగు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్సై వెంకటేశ్వరావు హత్యకు దారి తీసిన వివరాలు వెల్లడించారు.
ఏటూరునాగారం గ్రామానికి చెందిన జాడి సమ్మయ్య(38) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సల్లూరి పవిత్ర డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ నెల 16న లాలాయిగూడెంకు వెళ్లాడు. డబ్బుల విషయంలో పవిత్రతో పాటు ఆమె తాత సల్లూరి సాంబయ్య, సల్లూరి అనసూర్యతో సమ్మయ్య గొడవ పడ్డాడు. దీంతో వారు సమ్మయ్యను ఇంటి ముందు ఉన్న విద్యుత్తు స్తంభానికి తాళ్లతో కట్టేసి కొట్టి హత్య చేశారు.
సోమవారం ఉదయం లాలాయిగూడేనికి చెందిన మృతుడి దూరపు బంధువుకు సమ్మయ్య కుటుంబ సభ్యులు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయగా వారు పవిత్ర ఇంటికి వెళ్లి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. మృతుడి తమ్ముడు జాడి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు. హత్య చేసిన అనంతరం సమ్మయ్య, అనసూర్య, పవిత్ర ములుగుకు చేరుకోగా ఫోన్ ట్రేసింగ్ ద్వారా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.