Jagtial | జగిత్యాల కలెక్టరేట్, జూన్ 27: తాకట్టు పెట్టిన చెవికమ్మలు విడిపించి ఇవ్వాలని బావ దాడి చేయడంతో బావమరిది మరణించాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల టౌన్ ఎస్సై అబ్దుల్ రహీం తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని మిషన్ కంపౌండ్ ప్రాంతానికి చెందిన శివరాత్రి రమేశ్ (28) తన భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో చెల్లెలి చెవి కమ్మలను ఆమె అనుమతితో కుదువ పెట్టి వచ్చిన డబ్బుతో చికిత్స చేయించాడు.
విషయం తెలిసిన రమేశ్ బావ నాగదరి యాకుబ్ చెవికమ్మలను వెంటనే తిరిగి ఇవ్వాలని సోమవారం రాత్రి బావమరిదిపై దాడి చేశాడు. యాకుబ్ దాడి చేయడంతో రమేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. రమేశ్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.