హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ విద్యార్థుల సగం కడుపే నింపనున్నది. అల్పాహార పథకంతో అర్ధాకలే మిగులనున్నది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రోజు రెండు ఇడ్లీలు.. రెండు బొండాలు.. రెండు పూరీలు మాత్రమే ఇవ్వనున్నారు. ఒక చపాతీ/ దోశ మాత్రమే అందించనున్నారు. ఒక చపాతీ, రెండు ఇడ్లీలు, బొండాలతో సర్కార్ బడుల్లో చదువుకునే చిన్నారుల కడుపునిండుతుందా.. ఆకలి తీరుతుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు గల విద్యార్థులకు అల్పాహార పథకం అమలుచేయనున్నారు. ఈ రెండు ఇడ్లీలు, రెండు బొండాలు హైస్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఏ మాత్రం సరిపోవని ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు అంటున్నారు.
సహజంగా రెండు ఇడ్లీలు ఏడాది, రెండేండ్ల వయస్సు చిన్నారులకు సరిపోతాయి. ఇడ్లీలతో 89 క్యాలరీలు, బొండాలతో 340, పూరీల్లో 220 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. ఉదయం అల్పాహారంలో భాగంగా 3-5 ఏండ్ల మధ్య వయస్కులకు 300, 6-10 ఏండ్ల మధ్య వయస్కులకు 300 -400, 11 నుంచి 14 ఏండ్ల మధ్య వారికి 400- 500, 15-17 వయస్సు గల వారికి 500 -600 క్యాలరీల శక్తి గల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వమేమో 2 ఇడ్లీలు, 2 పూరీలు మాత్రమే ఇస్తామంటున్నది. పోషకాహారం అంటే.. ఆకలి తీర్చడమంటే ఇదేనా.? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బొండాలు ఆయిల్ ఫుడ్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బ్రేక్‌ఫాస్ట్ పథకం మెనూను ఇటీవలే ప్రభుత్వం ఖరారుచేసింది. తాజాగా ఈ పథకం మెనూను విడుదల చేసింది. సోమవారం దోశ/ చపాతీ, మంగళవారం రెండు మిల్లెట్ ఇడ్లీలు, బుధవారం రెండు పూరీలు, గురువారం రెండు మిల్లెట్ ఇడ్లీలు, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/ పొంగల్, శనివారం రెండు బొండాలు ఇవ్వనున్నారు. ఇవేకాకుండా సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు, మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ అందిస్తారు.
పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆకలి నిర్మూలన.. పౌష్టికాహార లోప నివారణ పేరిట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అల్పాహారం పథకం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.540కోట్లు, పాల సరఫరా కోసం రూ. 180కోట్ల చొప్పున రూ. 720కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని 26,178పాఠశాలల్లోని, 18.79లక్షల విద్యార్థులు ఈ పథకంతో లబ్ధిపొందనున్నారు. అయితే సర్కార్ ఖరారు చేసిన మెనూతో ఈ పథకం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా తయారయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులకు తిన్నంత బ్రేక్‌ఫాస్ట్‌ను కేసీఆర్ ప్రభుత్వం అందించింది. అయితే ఈ పథకాన్ని బంద్పెట్టిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రెండు ఇడ్లీలు. రెండు పూరీల పథకాన్ని తీసుకొచ్చింది.