నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, మెరుగైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి యువతీయువకులు వేలాదిగా తరలివవచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వేదికగా ఉద్యమిస్తున్న విద్యార్థి లోకానికి అండగా ఉన్నామంటూ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై విద్యార్థుల తరఫున గళమెత్తారు. ‘వీ వాంట్ జస్టిస్.. విద్యార్థులపై దమనకాండ ఆపాలి..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..ఢిల్లీలో పోలీసుల జులుం నశించాలి’ అంటూ కేటీఆర్ నినదించగా యువతీయువకులు ప్రతిస్పందించారు.
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్రం రక్తపిశాచిలా మారి దాడి చేసిందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల దీక్షకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై యు వత తీవ్ర నిరాశానిస్పృహలతో ఉన్నారని, ప్రధాని మోదీని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా తమ నేత కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేశాయని మండిపడ్డారు. యువతను నిర్లక్ష్యం చేస్తున్న ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
– మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
నీట్ లీకేజీకి ముందు జరిగిన పరీక్షలో 570 మార్కులతో 70వేల ర్యాంక్ వచ్చింది. ఇటీవల జరిగిన పరీక్షలో 470 వచ్చాయి. ఇప్పుడు 1.12 లక్షల ర్యాంక్ వచ్చింది. ఇలాంటి అన్యాయం ఎందరికో జరిగింది. పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం లోపించింది. మేకిన్ ఇండియా అని చెప్పి.. లీకేజీ ఇండియాగా మార్చారు. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి.
– నమ్రత, నీట్ బాధితురాలు
రైట్ టు ఎడ్యుకేషన్ రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దేశంలో అమలు కావడం లేదు. దేశంలో విద్యావ్యవస్థ దారుణంగా తయారైంది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేసి చూసినప్పుడే యువత బతుకులు మారుతాయి. ప్రశ్నించేవారిని అరెస్టు చేసి లోపల వేస్తే.. మా తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు. కేంద్రంపై తిరగబడుతరు.
– ఐశ్వర్య, జెన్‌జీ కార్యకర్త
మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను రెండు సార్లు నీట్‌కు హాజరయ్యా. 560 మార్కులు వచ్చాయి. ఈ లీకేజీలతో మాకు అన్యాయం జరుగుతున్నది. మళ్లీమళ్లీ రాయాలన్నా.. కోచింగ్‌కు వెళ్లాలన్న మాలాంటి కుటుంబాలకు భారమే. ఇంటర్ పూర్తిచేసి ఎంబీబీఎస్ చేయాలనుకునే వారికి ఈ లీకేజీలతో అన్యాయం చేస్తున్నారు.
– సహస్ర, విద్యార్థిని
యువతను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వాలు అధికారంలో కొనసాగవు. కేంద్రంలో ప్రధాని మోదీ మాదిరిగానే రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి విద్యారి,్థ నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలిపిన విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులు పెట్టి అణచివేస్తున్నారు. ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగడం ఖాయం. ఢిల్లీ ఘటనకు నిరసనగా తమ నేత కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి ఈ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు.
– బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇందిరాపార్క్ వద్దకు చేరుకోగానే ఆయనతో కరచాలనం చేసేందుకు వెల్లువెత్తిన అభిమానంతో వందలాది మంది యువతీయువకులు ఉత్సాహం చూపారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కేటీఆర్ నల్ల అంగీ ధరించి రాగా ఆయనతో సెల్ఫీలు తీసుకొనేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. చాలామంది దూరంనుంచే కేటీఆర్‌ను తమ సెల్ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన యువతీయువకులు

పేపర్ లీక్ ఎప్పుడు బంద్ అవుతది? అనే ప్రశ్నకు ‘చాక్లెట్ తిను’ అంటూ మోదీ బదులిస్తున్న వ్యంగ్య చిత్రంతో నిరసన తెలుపుతున్న దివ్యాంగ యువకుడు

నిరసన కార్యక్రమంలో కేంద్ర సర్కార్ తీరును ఎండగడుతున్న యువతి

విద్యార్థులపై పోలీసుల దమనకాండను చిత్రం ద్వారా ప్రదర్శిస్తున్న యువతి

ఇందిరాపార్క్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న యువతులు