మేము అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం.. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతాన్ని 42శాతం చేస్తాం.
-2023, నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తంగా 50 శాతానికి మించరాదు. అందులోనూ 243 డీ అధికరణం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా మేరకు ముందుగా వాళ్లకే రిజర్వేషన్ కల్పించాలి. ఆ తర్వాతే బీసీలకు కేటాయించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యం?
-రాష్ట్ర ప్రభుత్వానికి అనధికారికంగా తేల్చిచెప్పిన బీసీ కమిషన్!
BC Reservations | కరీంనగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌కు బ్రేకులు పడనున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 శాతానికి పెంచుతామన్న హామీకి మంగళం పాడబోతున్నదా? ఆచరణ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నదా? చేసేదిలేక పంచాయతీ ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? ఎంపీ ఎన్నికల సందర్భంగా జూన్‌లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు అందుకే ఆచరణలో పెట్టడం లేదా? స్థానిక సంస్థల ఎన్నికలపై ‘ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కెళ్తే గొయ్యి’ అన్న సంకట స్థితిని కాంగ్రెస్ సర్కారు ఎదుర్కొంటున్నదా?’ అంటే ‘అవును’ అన్న సమాధానమే వస్తున్నది. లోకల్‌బాడీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల తీరుతెన్నులు, అక్కడి పరిణామాలు చూస్తే ఏ పరిస్థితుల్లోనూ బీసీలకు ప్రస్తుతం ఉన్న 22.79 శాతం రిజర్వేషన్లను 43 శాతానికి పెంచే అవకాశమే లేదని స్పష్టమవుతున్నది. ఇదే విషయాన్ని బీసీ కమిషన్ కూడా ఇప్పటికే అనధికారికంగా తేల్చిచెప్పడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడ్డట్టు తెలిసింది.
2024, ఫిబ్రవరి 1తో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యింది. మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు జూలైతో ముగుస్తుంది. 2025 జనవరితో మున్సిపల్ పాలకవర్గాల గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3)(ఏ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోపే నిర్వహించాలని ఎన్నికల సంఘం గత ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (లెటర్ నంబర్ 921/టీఎస్ఇసీ-పీఆర్/2023) డిసెంబర్ 14న కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఎన్నికలకు పోవాలంటే సుప్రీం తీర్పు ప్రకారం బీసీ కమిషన్ నివేదిక తప్పనిసరి.
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత 23 శాతాన్ని 43 శాతానికి పెంచడం ఎంతమాత్రం సాధ్యం కాదని బీసీ కమిషన్ తేల్చిచెప్పినట్టు తెలిసింది. కులగణనకు సంబంధించి చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ దేశంలోని వివిధ రాష్ర్టాల్లో అధ్యయనం చేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కర్ణాటకలో 54 ప్రశ్నలతో చేసిన కులగణన మాత్రమే శాస్త్రీయంగా ఉన్నదని, మిగిలిన రాష్ర్టాల్లో చేసిన గణన ఏమాత్రం శాస్త్రీయంగా లేదని నివేదికలో వెల్లడించినట్టు తెలిసింది.
2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మేరకే బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున కేటాయించారు. ఈ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతానికి మించే వీలులేదని, ఇందులోనూ రాజ్యాంగంలోని 243 డీ అధికరణం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభాను బట్టి ముందుగా వాళ్లకు కేటాయించిన తర్వాతే మిగతా బీసీలకు కేటాయించాలని చెప్పినట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటకుండా ఉండాలన్న దానిపై ఆలోచన చేయాలని సూచించినట్టుగా తెలుస్తున్నది. ఎలా చూసినా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదు. అలాంటప్పుడు రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమని అనధికారిక నివేదికలో బీసీ కమిషన్ ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టును కాదని ప్రభుత్వం ఇవ్వజూసినా అది న్యాయస్థానాల్లో వీగి పోతుందని, తీర్పును అతిక్రమించి 50శాతం మించి రిజర్వేషన్లు అమలు చేసిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో ఎన్నికలను నిలిపివేశారని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం.
బీసీ కమిషన్ నివేదిక ఎన్నిరోజుల్లో ఇస్తుంది? ఏ పద్ధతిని అనుసరిస్తుంది? రిజర్వేషన్ల స్థిరీకరణలో ఎలాంటి వాతావారణం నెలకొంటుంది అని బీసీ సంఘాల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే కులగణన ఆధారంగానా? లేక ఓటరు జాబితా మేరకు నివేదిక ఇవ్వాలా? అన్న మీమాంసలో బీసీ కమిషన్ ఉన్నది. స్వతంత్రంగా ప్రక్రియ మొదలుపెట్టినా ప్రభుత్వ సహకారం లేకుంటే ఎలా? అన్న ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఇటు ప్రభుత్వం కూడా కులగణన అయ్యాక ఎన్నికలకు పోవాలా? లేక దేశంలోని కొన్ని రాష్ర్టాలను అనుసరించి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని ముందుకుపోవాలా? అన్న సందిగ్ధంలో పడినట్టు తెలుస్తున్నది. ఈ పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే అవకాశాలు దరిదాపులో కనిపించడం లేదు. చేసేది లేక స్థానిక సంస్థల ఎన్నికలను దాటవేస్తూ ముందుకుపోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో అనేక హామీలు గుప్పించింది. కామారెడ్డిలో ఏకంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23 శాతం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పింది. ఫలితంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టంచేసింది. బీసీ వర్గాలను ఉపకులాల వారీగా వర్గీకరించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించింది. బీసీ కులగణన లేదా ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటి సర్వే చేసి ఆ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని చెబుతూ వస్తున్నది.