Sircilla | ముస్తాబాద్, ఫిబ్రవరి 1 : ఉన్న ఇల్లు శిథిలమవడం.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో దవాఖాన నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి అంత్యక్రియలకు తరలించిన హృదయ విదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలకేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన చేనేత కార్మికుడు బిట్ల సంతోష్(48)కు భార్య శారద, ఇద్దరు కూతుళ్లు వైశాలి, దీపిక, కొడుకు సాయి ఉన్నారు. వీరి ఇల్లు శిథిలమవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సంతోష్ కొన్నేండ్లుగా క్యా న్సర్‌తో బాధపడుతున్నాడు. సిద్దిపేటలోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ముస్తాబాద్‌లోని తమ పాత ఇంటికి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని అక్కడ ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా అంబులెన్స్‌లోనే ఉంచా రు. భార్య, ముగ్గురు పిల్లలు కూడా చలిలోనే బయటే ఉండిపోగా, వారి పరిస్థితిని చూసి గ్రామస్తులు చలించిపోయా రు. ఉదయం అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలకు తరలించారు.
డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు కలెక్టర్ ఆదేశం
బిట్ల సంతోష్ మృతదేహం అంబులెన్స్‌లోనే ఉండిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం, తహసీల్దార్ సురేశ్.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. తక్షణమే ఇందిరమ్మ కాలనీలో ఉన్న డబుల్ బెడ్రూముల్లో ఒక ఇల్లు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు వారి కుటుంబ దీనస్థితిని చూ సి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు.