హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రెడ్లకు అధికారం అప్పగించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. రేవంత్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సుదీర్ఘ లేఖరాశారు. రేవంత్‌పై బీసీ నేతలు, ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు దిక్కుగా భావిస్తున్న తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్లు మాత్రమే నాయకత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి. వ్యక్తిగతంగా మీకు .. పార్టీకి ఈ వ్యాఖ్యలు తీవ్రనష్టం చేకూరుస్తున్నాయి. మీ మాటలపై అన్ని వర్గాలు తీవ్రంగా రగిలిపోతున్నాయి. తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. బహుజన వర్గాలన్నీ మీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో పాటు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో.. మాకంతా అంటూ ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ భాష, యాస అన్ని వర్గాలను అవమానించడంతో పాటు ఏకంగా పార్టీ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా, అవమానపర్చేలా ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యల్ని విరమించుకొని, వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు.