ఖైరతాబాద్, డిసెంబర్ 5: ‘దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే.. అందులో 60 కోట్ల మంది బీసీలే ఉన్నారు. బీసీ జనగణన జరిగితే వారే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారు. అందుకే ఢిల్లీ పెద్దలు భయపడుతున్నారు’ అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ‘బీసీ జనగణన-కేంద్ర ప్రభుత్వ విధానం-బీసీల తక్షణ కర్తవ్యం’ అంశంపై ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యోగ, బీసీ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీనవర్గాలకు కేంద్ర ప్రభుత్వాలు మొదటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. బీసీ ప్రధానిగా ఉన్నా బీసీలకు న్యాయం జరగకుంటే అంతకుమించిన ఘోరం మరొకటి ఉండదని విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలకు అనేక వినతులు సమర్పించామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ బీసీలకు గొప్ప గౌరవం ఇచ్చారని, చట్టసభల్లో వారికి తగిన ప్రాధాన్యం కల్పించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీల మంతా రైతు ఉద్యమ స్ఫూర్తితో బీసీల జనగణన కోసం పార్లమెంట్లో ప్రశ్నిస్తామని చెప్పారు. మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వే ప్రకా రం 2.9 కోట్ల కుక్కలు, 24 లక్షల పిల్లులు ఉన్నట్టు తేల్చారని, జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం వద్ద లెక్క లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కులాల జనాభా లెక్కించడం దేశానికి అవసరమని, తద్వారా ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయని, అసమానతలు తగ్గుతాయని చెప్పారు.
13న జంతర్ మంతర్ వద్ద జంగ్ సైరన్
బీసీ జనగణన సాధన కోసం ఈ నెల 13న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల జంగ్ సైరన్ నిర్వహించనున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. రైతు ఉద్యమమే స్ఫూర్తిగా ఎర్రకోటను ముట్టడించి బీసీల తడాఖా చూపిస్తామని చెప్పారు. తాటిపల్లి పాండు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, సీపీఐ నాయకుడు పాండురంగాచారి, నాయకులు రమేశ్, కుందారం గణేశ్‌చారి, చంద్రశేఖర్, మల్లేశ్, దానకర్ణాచారి, కుల్కచర్ల శ్రీణివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్ కుర్మా తాటికొండ విక్రమ్‌గౌడ్, శంకర్, రామరాజు, చెన్నయ్య, జాజుల లింగంగౌడ్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, జగన్నాథం, బడేసాబ్, భిక్షపతి, సురేశ్, భాస్కర్, మదేశి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.