రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమాణం రూ.2.75 లక్షల కోట్లు. అదే 2023-24లో రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు. కాగ్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం రాష్ర్టానికి అన్ని రకాల మార్గాల్లో కలిపి రూ.2.17 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చినా పూర్తి బడ్జెట్ కూడా కాస్త అటూ ఇటూగానే ఉంటుంది. ఈ లెక్కన బడ్జెట్ కన్నా పద్దులే 30-40% అధికంగా తేలుతున్నాయి. వీటిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక ఆయా విభాగాధిపతులు తలలు పట్టుకుంటున్నారు.
Congress Govt | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే శాఖలవారీగా పద్దులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సైతం ఆయా విభాగాధిపతులతో పద్దుల లెక్కలపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెట్టింది. హామీలను పరిగణనలోకి తీసుకొని పద్దులు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా బడ్జెట్ కేటాయింపులు ఏటా సగటున 8-15% వరకు పెరుగుతుంటాయి.
ఒకవేళ ప్రభుత్వం ఏవైనా రెండుమూడు రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుంటే, వాటికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఒక్కసారిగా పెంచాల్సి వస్తుంది. కానీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లోనూ భారీగా హామీలు గుప్పించింది. వాటిని తీర్చాలంటే ప్రతి రంగంలోనూ కనీసం సగటున 40-50% మేర పద్దులు పెంచాల్సి వస్తున్నదని, దీంతో లెక్కలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా వ్యవసాయ శాఖపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది.
వానకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతుభరోసా ఇవ్వాల్సి ఉన్నది. ఎరువులు, ఇతర అవసరాలకు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 10% అధికంగా నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. రైతుబంధు కింద ఇప్పటివరకు ఏటా రూ.15 వేల కోట్లు కేటాయించేవారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలంటే ఈ మొత్తాన్ని రూ.23 వేల కోట్లకు పెంచాల్సి ఉంటుందని అంచనా. దీనికితోడు రైతు కూలీలకు ఏటా రూ.12 వేల కోట్ల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఉపాధిహామీ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 34.41 లక్షల యాక్టివ్ జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 58.8 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు. జాబ్‌కార్డులను పరిగణనలోకి తీసుకొని లెక్కించినా, ఏటా రూ.12 వేల చొప్పున బదిలీ చేస్తే రూ.4 వేల కోట్లకుపైగా నిధులు అవసరం.
2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి రూ.26,831 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సాధారణ పెంపుతోపాటు అదనంగా కేటాయించాల్సిన రూ.15 వేల కోట్లు కలిపితే.. ఈ ఏడాది రూ.43 వేల కోట్ల వరకు కేటాయించాల్సి వస్తుందని అంచనా. అంటే దాదాపు 60% నిధులు అదనంగా కేటాయించాల్సి వస్తుందని భావిస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు ఈసారి కేటాయింపులు కత్తిమీద సాములా మారాయని అధికారులు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. తాము దళితబంధును అంబేద్కర్ అభయహస్తంగా మారుస్తామని, రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గత బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. ఈ మేరకు యూనిట్లు మంజూరు చేశారు. వీటికి నిధులు విడుదల చేయడంతోపాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, నిధుల కేటాయింపుతో రూ.40 వేల కోట్ల వరకు కేటాయించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలుకు దాదాపు రూ.20 వేల కోట్లు, ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలుకు రూ.28 వేల కోట్ల వరకు కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. మైనార్టీ సంక్షేమంలో ఇమాంలు, మౌజంలు, పాస్టర్ల గౌరవ వేతనాలు పెంచుతామన్న హామీని నెరవేర్చాలంటే, రూ.550 కోట్ల వరకు కేటాయించాల్సి వస్తుందని చెప్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు 5 వేల కోట్లు అవసరం అవుతుందని, ఉపాధి హామీ కూలీల వేతనాలు, పనిరోజుల పెంపునకు 2 వేల కోట్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయానికి 720 కోట్ల వరకు కావాల్సి ఉంటుందని వీటిని ఏ కోటా కింద పెడతారో తెలియని పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు.
మహిళా సంక్షేమ శాఖకు భారీ కేటాయింపులు అవసరమని అధికారులు చెప్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది మహిళలు ఉంటారని అంచనా. వీరికి ఏటా రూ.13,500 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కలు కడుతున్నారు. మహిళలకు స్కూటీ పథకానికి రూ.20 వేల కోట్ల వరకు కావాలని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రూ.2 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్ల కంటే డబుల్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికల హామీని అమలు చేయాలంటే ఈ మొత్తం రూ.24 వేల కోట్లకు పెరుగుతుంది. దీంతోపాటు ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన లబ్ధిదారుల సంఖ్య మరో 50-60% పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రూ.30 వేల కోట్లకుపైగా పెన్షన్లకే ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు.
8-15% ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో సాధారణ పెరుగుదల
40-50% కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్య రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు
గతేడాది బడ్జెట్2.77 లక్షల కోట్లు
ఆదాయం 2.17 లక్షల కోట్లు
ఈసారి హామీలకు అదనంగా 30-40%
విద్యాశాఖదీ ఇదే పరిస్థితి
విద్యారంగానికి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి రూ.650 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దీంతోపాటు విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామని చెప్పారు. ఇందుకు అర్హులైన విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరికీ ఇవ్వాలంటే ఏకంగా రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్తున్నారు. మండలానికి ఒక అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు హామీని నెరవేర్చాలంటే రూ.3 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల కోసం ఏటా సుమారు రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్టు అంచనా. త్వరలో కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. కేసీఆర్ ప్రభుత్వం చివరగా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లను తుడిచేస్తామని రేవంత్‌రెడ్డి పంతం పట్టిన నేపథ్యంలో అంతకుమించి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 44-45% ఫిట్మెంట్ ఇచ్చినా, ఈ పద్దు ఏకంగా రూ.60 వేల కోట్లకు చేరుతుందని చెప్తున్నారు.