హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా 2800 బస్సులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, 2000 బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో ఇప్పటికే వందల బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యత మొత్తం ప్రైవేటు సంస్థ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ కార్మికులంతా సంస్థకు చెందినవారే ఉంటారు. దీంతో ఆర్టీసీలోని సుమారు 10 వేల ఉపాధిని కోల్పోయే ప్రమాదముందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు.
కేంద్రం మొదటి దశలో వివిధ రాష్ర్టాల ఆర్టీసీలకు 14,028 ఎలక్ట్రిక్ బస్సులను రాయితీపై అందించాలని నిర్ణయించింది. ఈ రాయితీని కార్పొరేట్ సంస్థకు ఇస్తుందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. మరమ్మతులు కూడా ప్రైవేటు సంస్థనే చూసుకుంటుంది కాబట్టి ఆర్టీసీ గ్యారెజీలు ఉనికిని కోల్పోతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ డిపోల పరిధిలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ వనరులను వాడుకుంటూ ప్రైవేటు కంపెనీ లబ్ధి పొందుతుందని, ఆర్టీసీకి, కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కార్మికుల పొట్టకొట్టకుండా తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేలా అధికారాలు ఇవ్వాలని, రాష్టప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం.. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడంలేదని మండిపడుతున్నారు. కేంద్రం అందించే ఎలక్ట్రిక్ బస్సులు నేరుగా ఆర్టీసీకి ఇవ్వాలని కోరుతున్నారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్లతో ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిని రద్దుచేసి, ఆర్టీసీలే స్వయంగా ఎలక్ట్రిక్ బస్సులను కొని నడుపుకోవడానికి పథకంలో సవరణలు చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.