హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, డీటీ నరసింహతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తికోసం, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దోరలు, భూస్వాములు, జాగీర్దార్ల గడీలను బద్దలుకొట్టిన మహోత్తర ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటామని గుర్తుచేశారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అందరి చరిత్రను తన గొప్పతనంగా చెప్పుకుంటూ రాజకీయాలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 77వ వార్షికోత్సవాలను ట్యాంక్‌బండ్‌పై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మగ్దూం మోహినుద్దీన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మగ్దూం మోహినుద్దీన్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.