అచ్చంపేట రూరల్ : అమెరికా ( America ) రాజ్యం ప్రపంచానికి గుండాలా ( Puppet ) వ్యవహరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ( John Wesley ) ఆరోపించారు. వెనిజులా దేశంలో నిల్వ ఉన్న ఆయిల్, చమురులపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశ అధ్యక్షున్ని అరెస్టు చేసి బంధించడాన్ని వివిధ దేశాలు ఖండిస్తు న్నప్పటికీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని ఆరోపించారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీపీఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వెనిజులా అధ్యక్షున్ని అరెస్టు చేసి బంధించడం సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాలలో పేదలు, కూలీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల పైన చర్చ జరగలేదని, ఎమ్మెల్యేలు ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకున్నారని ఆరోపించారు. వ్యవసాయ రైతులకు రూ.12 వేలు, మహిళలకు రూ. 2,500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ , కల్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల సమస్యల పైన ఉద్యమాలు, పోరాటాలు చేయాలని జిల్లా కమిటీలకు సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, దేశ్యా నాయక్, శంకర్ నాయక్, మల్లేష్, సైదులు, ఆంజనేయులు పాల్గొన్నారు.