కాళేశ్వరాన్ని పండబెట్టి ఇప్పటికే ప్రాణహిత, గోదావరి జలాలను ఆంధ్రాకోసం అడ్డదారిలో వదులుతున్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు పూర్తయ్యి సిద్ధంగా ఉన్న పాలమూరు ప్రాజెక్టును కూడా బాబుగారి కోసం బలిపెట్టేందుకు సిద్ధమైంది. తొలుత పోలవరం-బనకచర్ల! తర్వాత పోలవరం-నల్లమలసాగర్! ఇప్పుడు గోదావరి-కావేరి అనుసంధానం! పేరేదైనా కానీ అన్నింటి లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ నోట్లో మట్టికొట్టి, గోదావరి జలాల్ని ఎత్తుకుపోవడం! బాబు ప్రాపకం కోసం ఉన్న హక్కులకూ నీళ్లొదలడం! కేంద్రం పెడుతున్న ఆంక్షల్ని ‘జీహుజూర్’ అన్నట్టుగా శిరసావహించడం! ఎంతలా లొంగిపోకపోతే.. ముఖ్యమంత్రి సొంతజిల్లాకు జీవం పోసే ప్రాజెక్టును సైతం ఆయన ప్రభుత్వమే అటకెక్కిస్తుంది? రెండేండ్లయినా రెండున్నర కిలోమీటర్లు కాలువ కూడా తవ్వకుండా కాలయాపన ఎందుకు చేస్తుంది?
(గుండాల కృష్ణ-మ్యాకం రవికుమార్)
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21(నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ హయాంలోనే 80శాతానికి పైగా పనులు పూర్తయి ఒక మోటర్తో ఎత్తిపోతలు కూడా ప్రారంభించిన పాలమూరు జీవధార. కేవలం రెండున్నర కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పాలమూరు భూముల్లో పరుగులు పెడుతుంది. కేసీఆర్ దాదాపు పూర్తిచేసిన జలాశయాల్లో సేద తీరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే నాటికి పూర్తయిన టెండర్లను రద్దు చేయకపోతే ఇప్పటికే కాలువలు పూర్తయి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని బీడు భూములకు జీవం పోసేది. మరి.. ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు దాటింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఎందుకు అటకెక్కించింది?
ఉన్నపళంగా కాలువల టెండర్లను రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తీసుకొస్తానని ఎందుకు ప్రకటించారు? ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వికారాబాద్ జిల్లాలోని ఆయకట్టును తెగనరికి రెండేండ్లుగా సర్వేలకే పరిమితమైన కొడంగల్ లిఫ్ట్ పథకం కింద ఎందుకు జమకట్టారు? కేంద్రంలోని మోదీ సర్కార్ పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపినా కిమ్మనకుండా.. 90టీఎంసీల ప్రాజె క్టు సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు కుదిస్తూ అనుమతులు ఇవ్వమంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాశారు? వీటన్నింటికీ మించి.. రెండున్నరేండ్లుగా ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును పడావుపెట్టిన రేవంత్‌రెడ్డి హడావుడిగా ప్రాజెక్టుపై ఇంజినీర్లు లేకుండా సమీక్ష ఎందుకు చేశారు? ఇదే సమయం లో బనకచర్లకు అంతర్భాగంగా ఉన్న గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టుకు అంగీకరిస్తే చంద్రబాబు దయతలచి పాలమూరుకు అనుమతులు ఇప్పిస్తారంటూ పచ్చ మీడియాలో కథనాలు ఎందుకు మొదలయ్యాయి?
ఇప్పుడు తెలంగాణలో జరుగాల్సిన చర్చ ఇదే. ఎందుకంటే.. ఇప్పటికే పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉరి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కృష్ణాజలాల్లోనూ రెం డున్నర సంవత్సరాలుగా రైతాంగానికి చారిత్రక అన్యాయం చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.27వేల కోట్ల పనుల్ని అంటే దాదాపు 80శాతానికి పైగా పనులు పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును రెండున్నరేండ్లుగా ఈ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలోకి పంపింది. అదే జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నప్పటికీ పనుల్లో ఎందుకు ముందడుగు పడలేదనేది లోతుగా ఆలోచించాల్సిన అంశం. రెం డు రోజుల కిందట సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెంటనే భూసేకరణ పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు మాత్రం లేరు. మరి.. నిజంగా ఈ సమీక్షతో పాలమూరు ప్రాజెక్టు బతికి బట్టకడుతుందా? కేసీఆర్ ప్రభుత్వం ఎంతమేర పూర్తిచేసింది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసిందనేది ఓసారి పరిశీలిద్దాం.
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి(పీఆర్ఎల్ఐఎస్) కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ప్రాజెక్టు పనులను మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించింది. అందులో 18 ప్యాకేజీల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత చేపట్టింది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటికుంటలు, చెరువులను నింపడమే కాకుండా 1,226 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో మొదటి దశ తాగునీటి పనులను చేపట్టింది.
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను రెండు కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తొలుత హెడ్ రెగ్యులేటర్, అక్కడినుంచి మూడు సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడినుంచి ఎనిమిది పంపుల ద్వారా 104 మీటర్ల పైన అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. అక్కడినుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం ద్వారా జలాలను ఏదుల పంప్‌హౌస్‌కు తరలిస్తారు. అక్కడ తొమ్మిది మోటర్ల ద్వారా 124 మీటర్లపైకి వీరాంజనేయ(ఏదుల) రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడినుంచి ఓపెన్ సొరంగాల ద్వారా నీటిని వట్టెం పంప్‌హౌస్‌కు జలాలను తరలిస్తారు. అక్కడినుంచి తొమ్మిది మోటర్ల ద్వారా 121 మీటర్ల పైకి వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. ఆపై 14కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా జలాలను కురుమూర్తి(కరివెన) రిజర్వాయర్‌కు తరలిస్తారు.
అనంతరం కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 8.5 కిలోమీటర్లతో నిర్మించిన సొరంగాల ద్వారా జలాలను ఉద్దండాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడినుంచి ఐదు మోటర్ల ద్వారా 122 మీటర్లపై జలాలను ఎత్తి ఉద్దండాపూర్ రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలను ఎత్తిపోస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి సొరంగం, ప్రధాన కాలువలతో పాటు దాదాపు 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లు పూర్తయ్యాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఈ నాలుగు రిజర్వాయర్లలోకి కృష్ణాజలాలను ఎత్తిపోసేందుకు పంపుహౌస్‌లు, మోటర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నార్లాపూర్-ఏదులకు నీటి సరఫరా చేసే ఎనిమిది కిలోమీటర్ల ప్రధాన కాలువలో కేవలం రెండు కిలోమీటర్ల పొడవున పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చిన్న పనులు పూర్తి చేస్తే శ్రీశైలం జలాశయం నుంచి కరివెన వరకు జలాలు పరుగులు తీసేవి.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే నాటికే వడ్డించిన విస్తరిలా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈ క్షణం వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. పైగా సర్కార్ నిర్లక్ష్యానికి ప్రతీకగా ఒక దశలో భారీ వర్షాలకు వట్టెం పంపుహౌస్ నీటమునిగి మోటర్లు సైతం తడిసిపోయాయి. అధికారంలోకి వచ్చిందే తడవుగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దండాపూర్ నుంచి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందించే రూ.8వేల కోట్ల విలువైన కాలువల టెండర్లను రద్దు చేశారు. ఈ క్షణం వరకు తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వందకు వంద శాతం కృష్ణా బేసిన్లో ఉండటంతోపాటు కృష్ణా నదికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన కృష్ణాజలాల్ని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టును తలపెట్టారు. కానీ రేవంత్ సర్కార్ విచిత్రంగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకుల ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలిస్తానంటూ పాలమూరు ప్రాజెక్టులో డిజైన్ చేసిన రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును అందులో నుంచి తొలగించారు. 215 టీఎంసీల సామ ర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందే మక్తల్, కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని దాదాపు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు పది టీఎంసీలు కూడా లేని జూరాల నుం చి కృష్ణాజలాలను అందించేందుకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పథకం ప్రకటించి, టెండర్లు పూర్తిచేసి ఆ పనులను మాత్రం వేగవంతం చేసింది.
ఇదీ నిన్నటిదాకా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన అడుగుల తీరు. కానీ అకస్మాత్తుగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి, వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఇదే అదనుగా పచ్చ పత్రికల్లో కథనాలు మొదలయ్యాయి. అదేందంటే.. ప్రాజెక్టుకు అనుమతుల కోసం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగిందట. నల్లమల సాగర్‌కు అనుమతి ఇవ్వాలంటే తెలంగాణకు చెందిన పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షరతు పెట్టిందని ఓ పత్రిక తొలుత లీక్ ఇచ్చింది. ఇంకో పత్రిక మరుసటి రోజే మరో అడుగు ముందుకేసి… ఈ ప్రతిపాదనలకు రెండు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని, ఇక జల జగడాలకు చెక్ పడినట్టేనని ఆ పత్రిక లీక్ కథనం.
మరి నిజంగా ఈ పరిణామాలన్నీ ఎవరికి సుజలం! ఎవరికి సుఫలం!! నల్లమల సాగర్‌కు తెలంగాణ, పాలమూరుకు ఏపీ ఒకే అని ఇస్తినమ్మ వాయనం.. పుచ్చుకుంటినమ్మ వాయనం.. అంటే సరిపోతుందా?! దాదాపు 13సంవత్సరాలుగా తెలంగాణ హక్కుభుక్తమైన నీటి వాటాలను తేల్చకుండా నానబెడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తాజా జలదౌత్యం వెనుక దాగి ఉన్న మర్మమేంటి? తొలుత బనకచర్ల… ఆపై నల్లమలసాగర్.. తాజాగా గోదావరి-కావేరీ మాటున ఈ గడ్డ హక్కుజలాల్ని కొల్లగొట్టేందుకు కేంద్రాన్ని ముందుకు ఉసిగొలుపుతున్న ‘బాబు’ ఎవరు? ఆయన దయాదాక్షిణ్యాలపై పాలమూరు ప్రాజెక్టు అనుమతులు ఆధారపడి ఉన్నాయా? అనే కుట్రల కొత్త అవతారాలపై కుల్లంకుల్లగా రేపటి కథనంలో..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం 2022, సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి డీపీఆర్ పంపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ(ఈఏసీ) పర్యావరణ అనుమతులకు అంగీకరించింది. ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. అంతేకాదు.. కేంద్రం ఏకంగా డీపీఆర్‌ను తిప్పి పంపింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీలను వాడుకుంటామని చెప్పారని, ఈ మేరకు పూర్తి వివరాలు ఇవ్వాలని తాము లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేనందున డీపీఆర్ వెనక్కి పంపుతున్నట్టు కేంద్ర జల్‌శక్తి శాఖ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
ఏ ప్రభుత్వమైనా సాగునీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తూ అందుకు కావాల్సిన అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కానీ రెండున్నరేండ్లుగా పాలమూరు ప్రాజెక్టు పను ల్ని నిరవధికంగా నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. ప్రాజెక్టు అనుమతుల కోసమంటూ హడావుడి చేయడం సాగునీటి రంగ నిపుణుల్ని సైతం విస్మయానికి గురిచేసింది. కేసీఆర్ ప్రభుత్వం ముం దుచూపుతో 90 టీఎంసీల నీటి కేటాయింపులతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టింది. పోలవరం ద్వా రా ఏపీ గోదావరి జలాలను మళ్లిస్తున్నందుకు బచావత్ ట్రిబ్యునల్ హక్కుగా ఇచ్చిన 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్లో వినియోగించకుండా ఉన్న మరో 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టు కింద వినియోగించుకుంటామని స్పష్టం చేసింది.
ఈ మేరకు 2022లోనే జీవో 246ను జారీ చేసింది. అదే సంవత్సరంలో కేంద్ర జల సంఘానికి డీపీఆర్‌ను సమర్పించింది. కానీ ప్రభుత్వం పనులు చేయకపోగా అనుమతుల కోసం వెంపర్లాడటం గమనార్హం. కేవలం మైనర్ ఇరిగేషన్లో వాడుకోని 45 టీఎంసీలకు ముందుగా అనుమతినిస్తే చాలంటూ సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై బీఆర్ఎస్ పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపడంతో గు ట్టు బయటపడిందని సామర్థ్యాన్ని తగ్గించేది లేదంటూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.