ఖైరతాబాద్, అక్టోబర్ 24: కోయంబత్తురులోని ఈశా హోం స్కూల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదని, అసత్య ఆరోపణలు మానుకోవాలని విద్యార్థుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాతో కుటుంబసభ్యులు రాధిక, వినోద్, పరిమళ, వంశీ మాట్లాడారు. ఈశా స్కూల్లో ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రద్ధగా చదువుచెబుతారని, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తారని తెలిపారు. 2019లో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ యామిని, సత్య ఎన్ రాగని దంపతులు చేసిన ఆరోపణ సత్యదూరమని పే ర్కొన్నారు.
ఘటనలో బాధితుడిగా పేర్కొన్న విద్యార్థి 2022 వరకు చదువుకున్నట్టు తెలిపారు. తర్వాత 2022 నుంచి 2024 జూన్ వరకు అదే స్కూల్లో యామిని వలంటీర్‌గా పనిచేశారని, ఆమెపై ఫిర్యాదులు, ఆరోపణలు రావటంతో పాఠశాల నుంచి తొలగించినట్టు వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలను దృష్టి మళ్లించేందుకే ఈశా స్కూల్‌పై ఆరోపణలు చేస్తున్నట్టు తెలిపారు. వారి ఆరోపణలతో తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, వెంటనే ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.