ఖమ్మం/రఘునాథపాలెం, నవంబర్ 13: రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కోటేశ్వరరావు విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారిని దాటుకొని వెళ్లి కలెక్టరేట్లో నినాదాలు చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతులను ఆదుకోలేకపోయారని విమర్శించారు.
తేమ శాతంతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేయాలని కపాస్ కిసాన్ యాప్ విధానాన్ని ఎత్తివేయాలని, మండల కేంద్రాల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసిన పలు సంఘాల నాయకులపై రఘునాథపాలెం పోలీసులు గురువారం కేసు నమోదుచేశారు. పోలీసుల విధులకు, ప్రజలకు ఆటంకం కలిగించారని చెప్పారు. పోలీసుల తీరుపై ప్రజాసంఘాల నేతలు మండిపడారు.