Kagazghat | ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అదో రిసార్ట్.. క్లబ్‌హౌజ్‌లు.. స్విమ్మింగ్ ఫూల్.. ఖరీదైన విల్లాలు.. ఈ నిర్మాణాలన్నీ ఉన్నవి ఒక చెరువులో. ఆ దృశ్యాలను చూడాలంటే హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని కాగజ్ఘట్కు వెళ్లాల్సిందే. లేక్వ్యూను తలదన్నే రీతిలో ఓ రియల్ సంస్థ యథేచ్ఛగా ఒక నీటి వనరుకు నిలువునా ఉరివేసింది. అంతేకాదు ఎగువ నుంచి వచ్చే వరద మార్గాన్ని మూసేసి మరో రెండు చెరువులకు మరణ శాసనాన్ని లిఖించింది.
ఇంత జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? వారికి నోటీసులు ఇచ్చి చెరువు దీనస్థితిపై హైడ్రాకు లేఖ రాశారు. ఓఆర్ఆర్ పరిధి వరకు మాత్రమే ఉండే హైడ్రాకు లేఖ రాయడమంటేనే అందులో మతలబు ఉన్నదని అర్థం అవుతుంది. నీటిపారుదల శాఖ చర్యలు తీసుకోదు. హైడ్రా పరిధిదాటి రాదు. అంతే సంగతులు!!
అధికార యంత్రాంగం ఈ స్థాయిలో ఎందుకు వత్తాసు పలుకుతున్నదంటే.. కొంతకాలం కిందట బీహార్ అసెంబ్లీలో నితీశ్‌కుమార్ బలపరీక్ష సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం ఈ రిసార్ట్‌లోనే కొలువుదీరింది. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపును పరిశీలించేందుకు వచ్చినపుడు అధికారులు సర్కారు సొమ్ముతో అక్కడికి బీటీ రోడ్డును నిర్మించారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి రెవెన్యూ పరిధిలోని కాగజ్‌ఘట్ గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో అలీ (ఆల్ల చెరువు) చెరువు విస్తరించి ఉన్నది. కాగజ్‌ఘట్ గ్రామం ఎగువభాగంలోని జాపాల అటవీప్రాంతంతో పాటు గున్గల్, గడ్డమల్లాయిగూడ గుట్టల ప్రాంతం నుండి వచ్చే వరద నీటిని నిల్వ చేసేందుకు నిజాం నాటి కాలంలో ఈ చెరువును నిర్మించారు. ఈ చెరువు అలుగుపారి దిగువన ఉన్న నోముల గ్రామపరిధిలోని ఊశమ్మ చెరువు, రెడ్డి చెరువు, ఊర చెరువులకు వరద నీరు అందిస్తుంది. అంటే అలీచెరువు పారితేనే దిగువన ఉన్న మూడు చెరువులకు జీవం వస్తుంది.
కానీ ఓ రియల్ సంస్థ ఈ చెరువు గొంతు నులిమింది. ఏకంగా ఎఫ్టీఎల్తో పాటు బఫర్‌జోన్‌లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టింది. చెరువు పైభాగంలో వెంచర్ ఏర్పాటు చేసి, రోడ్లు వేసి అందులో విల్లాల నిర్మాణం చేపట్టింది. అలాగే చెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాలువలోని కొంత భాగంలో సిమ్మింగ్పూల్ ఇతర ఆట వస్తువులతో పాటు పెద్దపెద్ద గెస్ట్‌హౌస్‌లను నిర్మించింది. ఇందులో భాగంగా భారీఎత్తున మట్టి తెచ్చి చెరువు ఎఫ్టీఎల్ను పూడ్చారు. దీంతో ప్రస్తుతం అలీ చెరువు సగం కంటే ఎక్కువగానే కనుమరుగైంది.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల దరిమిలా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళతారనే ఉద్దేశంతో అసలు నోటీసులు ఇవ్వకుండానే బుల్డోజర్లతో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. కానీ అలీ చెరువు విషయంలో మాత్రం కండ్ల ముందు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ స్పష్టంగా కనిపిస్తున్నా నీటిపారుదల శాఖ అధికారులు ఎంచక్కా నోటీసులు ఇచ్చారు. ఇంకేముంది.. సదరు సంస్థ అసలు ఎఫ్టీఎల్ నిర్ధారణనే తప్పు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని అధికారులే చెప్తున్నారు. అయితే సర్వే చేసి, హద్దులు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు సర్వే చేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.
కానీ ఇక్కడ బుల్డోజర్ న్యాయం ఎందుకు ముందుకు సాగటం లేదు. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ నీటిపారుదలశాఖ డీఈఈ సురేఖను సంప్రదించగా.. అలీ చెరువు ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని తెలిపారు. సదరు ఉన్నతాధికారులు హైడ్రాకు కూడా లేఖ రాశారని చెప్పారు. కానీ మంచాల మండలం ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉంటుంది. అంటే హైడ్రా పరిధిలోకి రాదు. అయినా ఇక్కడి అధికారులు ఇతర చోట్ల రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారుల్లా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించకోవడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.
చెరువులో నిర్మాణాలు చేపట్టిన రిసార్ట్ సంస్థ ఏకంగా అసైన్డ్ భూమి నుంచి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. కాగజ్‌ఘట్ గ్రామంలోని సర్వే నంబర్ 22 నుండి రోడ్డు వేయగా, తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలోంచి ఈ రోడ్డు వేశారని, తనకు సంబంధం లేకుండా తన బంధువులతో కాగితం రాయించుకొని ఈ భూమిని కాజేశారని గ్రామానికి చెందిన వాజీద్ అనే వ్యక్తి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోకపోవటం కొసమెరుపు.