హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ప్రజా సమస్యలపై సీపీఎంతో కలిసి పోరాడాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వెల్లడించారు.
త్వరలో ఖమ్మం జిల్లాలో పార్టీ రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల పొత్తు విషయంలో ఇప్పటివరకు బీఆర్ఎస్తో ఎలాంటి చర్చలూ జరగలేదని పేర్కొన్నారు. సింగరేణి ఏరియాతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఉంటుందని వివరించారు.
అదానీ కుంభకోణం విషయంలో ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గోద్రా అల్లర్లను డాక్యుమెంటరీ రూపంలో బయటపెట్టినందుకే బీబీసీ సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయించిందని విమర్శించారు. రబీ పంటలకు 24 గంటల విద్యుత్తు సరఫరాపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఇంకా చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, కలవేన శంకర్, తకెళ్లపల్లి శ్రీనివాస్ ఎన్ బాలమల్లేశ్, బాగం హేమంతరావు, ఎం బాలనర్సింహ, ఈటీ నరసింహ పాల్గొన్నారు.