మహబూబ్‌నగర్ : ఒమిక్రాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. మహబూబ్ నగర్, నారాయణపేట రెండు జిల్లాలో ఇప్పటి వరకు 79 శాతం వాక్సిన్ పూర్తయిందన్నారు. అయితే వంద శాతం పూర్తి చేసేందుకు రోజుకు మహబూబ్ నగర్ జిల్లాలో 6500, నారాయణపేట జిల్లాలో 7,500 మందికి వ్యాక్సీన్లు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మంత్రి తెలిపారు.
మున్సిపల్ వాహనాలు, చెత్త ఆటో రిక్షాలు, ప్రత్యేక వాహనాల ద్వారా వాక్సినేషన్ ఆవశ్యకత ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకొనని వారి ఇంటికి వెళ్లి వారితో వాక్సినేషన్ వేసుకోకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తామన్నారు.
రెండు జిల్లాలలో 15 రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కాగా, మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్పీల సమస్యలు తీర్చాలని మంత్రి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఇందుకు మంత్రి అనుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్పర్సన్ వనజ, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అధికారి కే. సీతారామారావు, నారాయణపేట అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా. రామ్ కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కృష్ణ, ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు.