Gurukula Teachers | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : శారీరక వైకల్యాన్ని జయించి కష్టపడి ఉద్యోగాలను సాధించారు. కానీ గురుకుల టైంటేబుల్ ముందు ఓడి అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలను చేయలేక ఇంటిబాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లోని దివ్యాంగ ఉపాధ్యాయులు, ఉద్యోగుల దుస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 1022 గురుకులాలు ఉన్నాయి. ఆయా గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్తోపాటు ఇతర కేడర్లలో 8300లకుపైగా పోస్టుల భర్తీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన 4శాతం రిజర్వేషన్ ఫలితంగా దాదాపు 760మంది దివ్యాంగులు ఉద్యోగాలను సాధించారు. వీరేకాకుండా గతంలో నియామకమైన వారిని కలిపితే దాదాపు 1200 మందికిపైగా దివ్యాంగులు గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
గురుకులాల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు పనివేళలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకానొక దశలో విధులు నిర్వహించలేక ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా గురుకులాల్లో సరైన వసతులు లేవు. కొత్తగా రిక్రూట్ అయిన అనేకమంది దివ్యాంగులకు దూరప్రాంతాల్లో అపాయింట్మెంట్లు ఇచ్చారు. వీరంతా పనిచేసే ప్రాంతాల్లో ఉండలేక, నిత్యం రాకపోకలు సాగించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదీగాక ఇటీవలనే ప్రభుత్వం కామన్ టైం టేబుల్‌ను నిర్ణయించింది.
ఉదయం 8గంటలకే గురుకులాలకు చేరుకుని రాత్రి 9గంటల వరకు ఉండాలి. గురుకులాల పనివేళల్లో గర్భిణులకు మినహాయింపులు ఉన్నాయి. కానీ దివ్యాంగ ఉద్యోగులకు లేవని వాపోతున్నారు. నిర్ణీత పనివేళలను కచ్చితంగా పాటించాల్సిందేనని గురుకుల ప్రిన్సిపాళ్లు ఒత్తిడి తెస్తున్నారని, తమను సాధారణ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారని కన్నీటిపర్యంతమవుతున్నారు.
దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం 2016 ప్రకారం దివ్యాంగ ఉద్యోగులకు సులభతరంగా విధులను నిర్వర్తించుకునే పరిస్థితులను కల్పించాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 20(1) ప్రకారం దివ్యాంగులపై ఎటువంటి వివక్షనూ చూపవద్దని, సంస్థలో విధించిన షరతులు, పనిస్వభావాన్ని బట్టి అందులో దివ్యాంగ ఉద్యోగులు పాల్గొనడా న్ని ఈ సెక్షన్ కింద మినహాయించవచ్చని తె లిపింది. సెక్షన్ 20 (2) ప్రతి ప్రభుత్వ వ్యవ స్థ, సంస్థ వైకల్యం గల ఉద్యోగులకు వసతిని, భౌతిక అడ్డంకులులేని సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని నిర్దేశించింది. ఆయా సెక్షన్లను అనుసరించి గురుకుల పనివేళలల్లో తమకు సడలింపులివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగుల బాధ్యత ఆయా ప్రభుత్వ సంస్థలదే. ప్రభుత్వమే పనిచేసే చోట వసతిని కల్పించి, పనివేళల్లో మినహాయింపులను ఇవ్వాలి. షెడ్యూల్‌కు గంట తరువాత వచ్చేలా, ఒక గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతివ్వాలి. బీహెచ్ఈఎల్ వంటి సంస్థలు ఇలాంటి మినహాయింపులను కల్పిస్తున్నాయి. గురుకులాల్లో పనిచేసే దివ్యాంగులందరికీ పనివేళల్లో సడలింపువ్వాలి.
– నర్రా నాగేశ్వర్రావు, దివ్యాంగుల సలహాదారుల బోర్డు మెంబర్