ఆదిలాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ కోసం అన్నదాతల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ విషయంలో చేసిన మోసాన్ని ఎండగడుతూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో 15మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. దీంతో రైతులు నిరసనకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదే జిల్లాలోని తాంసి మండలం కప్పర్లకు చెందిన వందమంది రైతులు శుక్రవారం తమ ఊరి నుంచి పాదయాత్ర చేపట్టారు. ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని వాపోయారు. రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా పట్టాపాస్లు పుస్తకం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల పేరిట ఎగ్గొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తాంసి కో ఆపరేటివ్ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న 70 శాతం మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. మూడు విడుతల్లో కలిపి 200 మంది రైతులకు మాఫీ వర్తించలేదని, బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని మండిపడ్డారు. అందుకే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పాదయాత్రగా వచ్చినట్టు చెప్పారు. అనంతరం తమకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ లక్ష్మి, వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు.
నాలుగు ఎకరాలపై నేను తాంసి మండలం కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 1.64 లక్షల లోన్ తీసుకున్న. ఏటా రెన్యూవల్ చేసుకుంటున్న. నా భార్య పేరిట భూమి ఉన్నా లోన్ తీసుకోలే. నా ఒక్కని పేరుమీదే ఖాతా ఉన్నది. నాకు మూడు విడుతల్లోనూ రుణమాఫీ కాలే. వ్యవసాయ అధికారులను అడిగితే డాటా నాట్ ఫౌండ్ అని వస్తుందంటున్నరు. బ్యాంకు అధికారులను అడిగితే వివరాలు పంపకపోవడం వల్లే రుణమాఫీ కాలేదంటున్నరు. రుణమాఫీకి అర్హుడిగా ఉన్న నా లోన్‌ను రద్దు చేయాలి.
నేను కప్పర్ల గ్రామీణ బ్యాంకులో రూ. 1.60 లక్షలు రుణం తీసుకున్న. రేవంత్‌రెడ్డి చెప్పినట్టు నా లోన్ మూడో విడుతలో మాఫీ అవుతదనుకున్న. కానీ లిస్టులో నాపేరు లేదు. సార్లను అడిగితే నీ లోన్ వివరాలు పంపించినం అంటున్నరు. నేను రైతును కాదా ? నాకు రుణమాఫీ ఎందుకు కాలే? పాత సర్కారు చెప్పినకాడికి అందరికీ రుణమాఫీ చేసింది. వీళ్లు మాత్రం కొందరికే ఇచ్చి చాలామందికి మాఫీ చెయ్యలే. మా బాధను అర్థం చేసుకొని రుణమాఫీ చెయ్యాలి.
నాకు కప్పర్ల శివారులో మూడెకరాల భూమి ఉన్నది. బ్యాంకులో రూ.1.70 లక్షల పంటరుణం తీసుకున్న. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు నాకు లోన్ మాఫీ అవుతదని 8 నెలల నుంచి ఎదురుచూస్తున్న. మూడో విడుత ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. వ్యవసాయ పనులు వదిలి అధికారుల చుట్టూ తిరుగుతున్న. ప్రభుత్వం ముందుగా చెప్పినట్టు షరతుల్లేకుండా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలి.