హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఐటీ అధికారుల పేరుతో శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్ మార్కెట్ నవకార్ కాంప్లెక్స్‌లో ఉన్న బాలాజీ గోల్డ్ షాప్‌లోకి ప్రవేశించిన నిందితులు దుకాణంలో అవకతవకలు జరిగాయని, సోదాలు చేయాలని చెప్పి పనివాళ్ల నుంచి సెల్ఫోన్లు లాక్కుని గదిలో బంధించారు.
అనంతరం తనిఖీల పేరుతో 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులు మహారాష్ట్ర పారిపోయినట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందాలు నిందితులను అరెస్ట్ చేశాయి. వారిని మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన జకీర్, రహీమ్, అక్షయ్, ప్రవీణ్‌లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న నలుగురు నిందితులు వేర్వేరుగా ప్యాట్నీ సెంటర్లోని ఓ లాడ్జిలో దిగారు. ఒకరికొకరు పరిచయం లేనట్టుగా, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించారు. 27న నిందితుల్లో ఒకడు తన తల్లి చనిపోయిందని చెప్పి హడావుడిగా రూము ఖాళీ చేసి మూడు రోజులకు గాను రూ. 3 వేలు చెల్లించి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. నగల దుకాణంలో చోరీకి ముందు నిందితులు రెక్కీ నిర్వహించారని, పక్కా ప్రణాళికతోనే చోరీ చేసినట్టు వివరించారు.