హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు పొడిగించింది. ఈ కేసులో రెండోసారి విధించిన రిమాండ్ గురువారంతో ముగియడంతో జైలు అధికారులు ఆయనను వర్చువల్‌గా జడ్జి ముందు హాజరు పరిచారు.
జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించాలంటూ సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇరుపక్షాల వాదనలు శుక్రవారం మధ్యాహ్నం వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.