హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపక శాఖలో దేశవ్యాప్తంగా ఫైర్ ఆడిటర్స్ను నియమించుకునే వెసులుబాటును ఆయా రాష్ర్టాలకు అప్పగిస్తూ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎస్ఎఫ్ఏసీ) సమావేశంలో తీర్మానించారు. షెరటన్ హోటల్లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఏసీ 45వ సమావేశం నిర్వహించారు.
ఫైర్ ఆడిటర్స్ కావాలని ఆయిల్ ఇండస్ట్రీ సేఫ్టీ డైరెక్టరేట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్ర సంస్థల ప్రతినిధులతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అగ్నిమాపక విభాగాలకు చెందిన హెచ్వోడీలు ప్రతిపాదించగా.. కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఫైర్ నాలెడ్జ్, విద్యార్హత, ప్రతిభ ఆధారంగా ఆన్లైన్ ద్వారా ఫైర్ ఆడిటర్స్ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు భవనాలు, ఫైర్ ఫైటింగ్ వెసులుబాటు, వస్తు సామగ్రి వంటి అంశాలపై ఆడిట్ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా అగ్నిమాపకశాఖ అధికారులు ‘ఎన్వోసీ’ జారీ చేస్తారు.