హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ గడువు మే 31వ తేదీతో ముగిసింది. రాయితీ పథకం కింద రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం కింద ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ఫీజుపై 25% రాయితీ గడువును మూడుసార్లు పొడిగించారు. తొలుత ఫిబ్రవరి నుంచి మార్చి వరకు, ఆ తర్వాత ఏప్రిల్ వరకు, ఏప్రిల్ నుంచి మరో మూడు రోజులు, ఆ తర్వాత మే 31 వరకు పొడిగించారు.
ఈ పథకం ద్వారా శనివారం వరకు రాష్ర్టానికి రూ.1,986 కోట్ల ఆదాయం సమకూరింది. 2020లో ప్రారంభమైన ఎల్ఆర్ఎస్ కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 5.75 లక్షల మందికి ఎల్ఆర్ఎస్ ఎస్టిమేషన్ ఫీజు లేఖలు పంపగా, 3.25 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఈ ప్రక్రియ ద్వారా మే 31 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,986.55 కోట్ల ఆదాయం సమకూరింది. ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులను వేధిస్తున్నాయి.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులు చేసినప్పటికీ ‘ఫీజు నోటిఫై కాలేదు’ అనే ఎర్రర్ రావడం, దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోలేకపోవడం, ఓటీపీ సమస్యలు, సర్వర్ క్రాష్ వంటి సమస్యలు నిత్యకృత్యమయ్యాయి. కొందరు దరఖాస్తుదారులు తమ ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నట్టు చూపించడం లేదా అసాధారణంగా అధిక రుసుములు విధించడం వంటి సమస్యలను ఎదురొంటున్నారు.
మార్చి 31వ తేదీ వరకు 1,513 కోట్లు
ఏప్రిల్ 30వ తేదీ వరకు 1,863 కోట్లు
మే 31వ తేదీ వరకు 1,986 కోట్లు