హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు 16వ ఆర్థిక సంఘం నిధులను ప్రకటించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేండ్ల కాలానికి తెలంగాణకు రూ.21,517 కోట్లు కేటాయించింది. ఏపీకి మనకంటే రూ.7,270 కోట్లు అదనంగా అంటే రూ.28,787 కోట్లు ప్రకటించింది. అన్ని రాష్ర్టాలకు కలిపి రూ.4,35,236 కోట్ల గ్రాంట్లను సిఫార్సు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల(ఆర్ఎల్బీ)కు రాష్ట్రానికి కేటాయించిన మొత్తం నిధుల్లో రూ.7,974 కోట్లు ‘బేసిక్ గ్రాంట్స్’గా, మిగిలిన రూ.1,994 కోట్లను ‘పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్’ కింద కేంద్రం ప్రతిపాదించింది. ఏపీకి ఈ ఐదేండ్ల్లలో మొత్తం రూ.16,628 కోట్లు (బేసిక్ గ్రాంట్స్ రూ.13,302 కోట్లు, పెర్ఫార్మెన్స్ కింద 3,32 6 కోట్లు) లభించాయి.
తెలంగాణ కంటే ఏపీకి అదనంగా రూ.6,660 కోట్లు కేటాయించడం గమనార్హం. తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ)కు బేసిక్ గ్రాంట్స్గా రూ.9,239 కోట్లు, పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్గా రూ.2,310 కోట్లు మొత్తంగా రూ.11,549 కోట్లు సిఫార్సు చేశారు. ఏపీకి బేసిక్ గ్రాంట్స్ రూ.9,727 కోట్లు, పెర్ఫార్మెన్స్ కింద రూ.2,432 కోట్లు, మొత్తంగా రూ.12,159 కోట్లు కేటాయించారు. ఇలా ఆర్ఎల్బీ, యూఎల్బీలకు కలిపి తెలంగాణ కంటే ఏపీకి అదనంగా రూ.7,270 కోట్లు కేటాయించారు. విపత్తు నిర్వహణ నిధుల విషయంలో కూడా కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపించింది. ఏపీకి రూ.6,125 కోట్లు కేటాయిస్తే, తెలంగాణకు మాత్రం కేవలం రూ.2,774 కోట్లే ప్రతిపాదించింది.
మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తొలిసారిగా ‘తీవ్రమైన ఎండతీవ్రత, పిడుగుపాట్లు’ను కూడా జాతీ య విపత్తుల జాబితాలో చేర్చారు. వీటివల్ల నష్టపోయినవారు ఇకపై రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్డీఆర్ఎఫ్) నుంచి తక్షణ సహాయం పొందవచ్చు. ఒక రాష్ట్ర ఖాతాలో ఉన్న నిధులు, మూడేండ్లలో ఆ రాష్ట్రానికి వచ్చిన మొత్తం కేటాయింపుల కంటే ఎకువగా ఉంటే.. కేంద్రం తదుపరి విడత నిధులను తాతాలికంగా నిలిపివేస్తుంది. ఈసారి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను జనాభా ఆధారంగా కాకుండా, డిజాస్టర్ రిస్ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయించారు. విపత్తు నిర్వహణ నిధులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో ఖర్చుల భారాన్ని భరించాల్సి ఉంటుంది.
15వ ఆర్థిక సంఘం కేటాయింపులతో పోల్చిచూస్తే తెలంగాణకు కేంద్ర గ్రాంట్లు మెరుగయ్యాయి.15వ ఆర్థిక సంఘం (2020-21 నుంచి 2025-26) రాష్ట్ర పంచాయతీలకు రూ.9,050 కోట్లు కేటాయించగా, 16వ ఆర్థిక సంఘం (2026-27 నుంచి 2030-31) రూ.9,968 కోట్లు కేటాయించింది. గతంతో పోలిస్తే రూ.918 కోట్లు అదనంగా (10% వృద్ధి) లభించాయి. ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు మాత్రం తెలంగాణకు రూ. 6,660 కోట్లు తకువగా కేటాయించారు.
ఆర్ఎల్బీలు, యూఎల్బీలకు నిధులు స క్రమంగా విడుదల కావాలంటే కేంద్రం విధించిన కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటు ంది. స్థానిక, పట్టణ సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు కొలువుదీరాలి. రెండేండ్ల ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో పొందుపరచడంతోపాటు, ప్రొవిజనల్ అకౌంట్స్ అందుబాటులో ఉంచాలి. పన్నుల వసూళ్లు పెంచుకొని, ఆర్థిక క్రమశిక్షణ పా టించే రాష్ట్రాలకే ప్రోత్సాహకాలు అందుతాయి.
నిధుల వినియోగం వివరాలను ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే కేంద్ర నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ ప్లస్ నిర్వహణకే వినియోగించాలి. మిగిలిన 50 శాతం (అన్ టైడ్) నిధులను స్థానిక అవసరాలకు వాడుకోవచ్చు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు 10 పనిదినాలలోపు స్థానిక సంస్థల ఖాతాలకు బదిలీ చేయాలి. ఆలస్యమైతే వడ్డీతో కలిపి ఆ మొ త్తాన్ని ఆర్ఎల్బీలకు, యూఎల్బీలకు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది.