Minister Harish Rao | బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడ్డారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దయదల్చి ఇచ్చినట్టు ఫోజుకొట్టారు. అంతకంటే విడ్డూరం ఏమిటంటే తెలంగాణలోని కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలూ మోదీ సర్కారు తెలంగాణకు ఇచ్చిన నిధులేనట! ఇంతకంటే దారుణం ఇంకోటి.. తెలంగాణ పౌరులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే అవి కూడా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల కిందికే వస్తాయట. తెలంగాణ ప్రభుత్వం లోన్లు తీసుకోవడానికి అనుమతించడం కూడా మోదీ సర్కారు రాష్ర్టానికి చేసిన మహా సాయమేనట! బీజేపీ సర్కారు చేతిలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు సర్వనాశనమవుతున్నదో అర్థం కావాలంటే కిషన్‌రెడ్డి లెక్కలు వింటే చాలు!! కిషన్ మాటల డొల్లతనాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కుండ బద్ధలు కొట్టినట్టు బయటపెట్టారు. రేపోమాపో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ బీజీపీ బండారాన్ని బజార్లో పెడతానని ప్రకటించారు.
కిషన్‌రెడ్డి: కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపంలో తెలంగాణకు నిధులు ఇస్తున్నాం.
వాస్తవం: రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకు ఇచ్చే జీతాలు, పెన్షన్లు తెలంగాణకు ఇస్తున్న నిధులు ఎలా అవుతాయి? ఆ ఉద్యోగులు ఎవరి కింద? ఎవరి కోసం పనిచేస్తున్నారు? న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, ఉద్యోగులకు చేస్తున్న ఖర్చులు కూడా తెలంగాణకు ఇస్తున్న నిధులు ఎలా అవుతాయి?
కిషన్‌రెడ్డి: జల్‌జీవన్ మిషన్ ద్వారా 2014 నుంచి తెలంగాణకు నిధులు ఇస్తున్నాం.
వాస్తవం: జల్జీవన్ను ప్రారంభించిందే 2019లో. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వ మిషన్ భగీరథే స్ఫూర్తి.
మరి లేని పథకానికి కేంద్రం నిధులెలా ఇచ్చింది?
కిషన్‌రెడ్డి: తెలంగాణ పౌరులకు బ్యాంకులు ఇస్తున్న రుణాలు కేంద్రం ఇస్తున్నవే
వాస్తవం: బ్యాంకులు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎవరికైనా రుణాలు ఇవ్వవచ్చు. అవి ప్రభుత్వానికి ఇస్తున్న నిధులెలా అవుతాయి? అయినా, బ్యాంకులు ఇచ్చే రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ఎలా అవుతుంది? బ్యాంకులకు కేంద్రం నిధులు ఇస్తున్నదా? బ్యాంకులు పౌరులకు ఇచ్చే లోన్లు కూడా తెలంగాణ ఖాతాలోనే వేస్తారా?
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులకంటే అదనంగా ఏమిచ్చారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టీ హరీశ్‌రావు సవాల్ విసిరారు. గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ అదనంగా ఏమిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పేరొన్న అంశాలపై హరీశ్‌రావు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కిషన్‌రెడ్డి పూర్తిగా అవాస్తవాలు చెప్పారని, త్వరలో వాస్తవాలతో తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. కిషన్‌రెడ్డి పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన అబద్ధాలనే కిషన్‌రెడ్డి మరోసారి చెప్పారు తప్ప.. పనికొచ్చేది ఒకటీ మాట్లాడ లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, ప్రజలకు బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాలను కూడా కిషన్‌రెడ్డి కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని విరుచుకుపడ్డారు. జన్‌ధన్ ఖాతాల గురించి మాట్లాడుతున్నారని, ప్రారంభించిన వాటిలో 50 శాతానికిపైగా మనుగడలో లేవన్న సంగతి కిషన్‌రెడ్డికి తెలియదా? అని నిలదీశారు. పన్నుల పంపిణీ రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చిన హకు అని, అది దేశ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో భాగం కాదని స్పష్టంచేశారు. కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41% ఉండాలని ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసినప్పటికీ, వాస్తవంగా కేంద్రం 30% మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. సెస్సులు, సర్‌చార్జీల రూపంలో దోపిడీకి పాల్పడుతున్నదని మడిపడ్డారు.
పన్నల పంపిణీలో తెలంగాణ వాటా 2014-15లో 2.893% ఉండగా, 2021-22 నాటికి 2.102%కి తగ్గిందని మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేంద్ర వాటాగా రూ.1,588.08 కోట్లతో తెలంగాణలో 100% ఇండ్లకు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద రూ 36,000 కోట్లు వెచ్చించి ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసింది. కేంద్రం ఇస్తున్న మొత్తం మిషన్ భగీరథ నిర్వహణకు కూడా సరిపోదు. రాబడి, వ్యయ ప్రవాహాల మధ్య అసమతుల్యతను అధిగమించడానికి ఆర్బీఐ ద్వారా అన్ని రాష్ట్రాలకు అందించబడిన స్వల్పకాలిక సదుపాయమే వేస్ అండ్ మీన్స్. ఇది ఆర్బీఐ కల్పించే సదుపాయం. ఈ అడ్వాన్సులపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీనిని పట్టుకొని కేవలం తెలంగాణకే ప్రత్యేకంగా ఆర్బీఐ ఏదో చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉన్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విభజన చట్టం హమీలు ఎందుకు నెరవేర్చరో కిషన్‌రెడ్డి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని నిలదిశారు. ‘బీబీనగర్ ఎయిమ్స్‌కు నామమాత్రంగా నిధులిచ్చి నత్త కూడా సిగ్గు పడేలా పనులు జరుగుతుంటే కిషన్‌రెడ్డి దీనిని కేంద్రం గొప్పతనమని చెప్పుకుంటారా? ఆయుష్మాన్ కింద ఇచ్చేది గోరంత.. ఆరోగ్యశ్రీ కింద మేమిచ్చేది కొండంత. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసిరాసి అలసిపోయాం. ముందు వాటిని కిషన్ రెడ్డి ఇప్పించాలి. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.723 కోట్ల పరిహారాన్ని మూడేండ్ల నుంచి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? ఏపీ ఖాతాలో పొరపాటున జమ అయిన రూ.495 కోట్లను తొమ్మిదేండ్ల నుంచి అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదు? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రం ఎందుకు స్పందించడంలేదు? బోరు బావుల మోటర్లకు విద్యుత్తు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్న కారణంతో రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల నష్టం చేశారు.
ఎఫ్ఆర్బీఎం నిబంధనలు మార్చడంతో రాష్ట్రం రూ.15,033 కోట్లు నష్టపోయింది. పన్నుల వాటా సక్రమంగా అమలు చేసి ఉంటే రూ.33,712 కోట్ల బకాయిలు రాష్ట్రానికి అదనంగా వచ్చేవి. ఇలా అన్ని కలిపి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రూ.1.43 లక్షల కోట్లు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. కిషన్‌రెడ్డి చెప్పిన అబద్ధాల పుట్టను త్వరలోనే పూర్తి ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారానే బద్ధలు కొడతాం’ అని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
తెలంగాణలో 2017-18 నుంచి 2022-23 వరకు జీఎస్టీ పరిహారం సెస్‌గా రూ.34,737 కోట్లు కేంద్రం వసూలు చేసిందని, ఇందులో తెలంగాణకు దకింది రూ.8,927 కోట్లేనని హరీశ్‌రావు తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదటి రెండేండ్లలో పరిహారంగా వచ్చింది రూ.169 కోట్ల్లు మాత్రమేనని వివరించారు. ‘గత రెండేండ్లలో తెలంగాణ నుంచి వసూలైన జీఎస్టీ సెస్ రూ.10,285 కోట్లు. అయితే, పరిహారం మొత్తం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాలేదు. జీఎస్టీ పరిహార నిధి నుంచి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం ఐదేండ్ల వరకే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.2,250 కోట్లు విడుదల చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా 2019-20, 2020-21, 2022-23 సంవత్సరాలకు నిధులు ఇవ్వనేలేదు.
కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి సంతృప్తి వ్యక్తంచేసినప్పటికీ, గత మూడేండ్లకుగాను రూ.1,350 కోట్లు ఎలాంటి కారణం లేకుండా ఆపేశారు. దీనికి కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెప్తారు?’ అని హరీశ్‌రావు నిలదీశారు. జాతీయ రహదారులకు కేటాయింపులు రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ల నుంచి జరుగుతాయని, కేంద్ర ప్రభుత్వంపై దీనివల్ల అదనంగా పడే భారం ఏమీ లేదని గుర్తు చేశారు. తెలంగాణకు కేటాయించిన నిధులు కిషన్‌రెడ్డి మెహర్భానీతో రాలేదని స్పష్టంచేశారు. రాష్ట్రం నుంచి ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఈ ఖర్చులో ఎకువభాగం పీడీఎస్ కింద ఆహార ధాన్యాల విక్రయం ద్వారా తిరిగి కేంద్రం తిరిగి రాబట్టుకొంటుందని వెల్లడించారు.
రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ రూ.33 వేల కోట్లు ఇస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్తున్నారని, గత ప్రభుత్వాలు ఈ సబ్సిడీ ఇవ్వలేదా? అని హరీశ్‌రావు నిలదీశారు. ‘ఎరువుల రాయితీని తెలంగాణలో రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు ఇస్తున్నారు. ఎరువుల కంపెనీకి ఇచ్చే సబ్సిడీని తెలంగాణ రైతులకు ఇచ్చే సబ్సిడీగా ఎలా పరిగణిస్తారు? ఆర్బీఐ స్వతంత్ర సంస్థ.. ఓవర్ డ్రాఫ్ట్ ఇతర ఆర్థిక విషయాల్లో అది కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం సహజం. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కొన్నిసార్లు మనకూ ఇచ్చారు. ఏ వెసులుబాటు ఇచ్చినా దానికి వడ్డీ కూడా ఆర్బీఐ వసూలు చేస్తుంది. దీంట్లో బీజేపీ గొప్పతనం ఏమున్నది? ఆర్బీఐ కేంద్రం చెప్పుచేతల్లో ఉండే సంస్థ అని కిషన్‌రెడ్డి చెప్పదలుచుకున్నారా? తెలంగాణ పౌరులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలా వద్దా? అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? నిబంధనల ప్రకారమే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ఏమున్నది? కిషన్‌రెడ్డి లేని గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నారు’ అని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.