Lagacharla | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి వచ్చి చెబుతున్నాం.. ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు మా భూములు ఇచ్చేది లేదు అని లగచర్ల బాధిత కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమ గ్రామాలు, తండాల్లో పోలీసుల అరాచకాలు, దాడులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మనవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసిన తర్వాత బీఆర్ఎస్ మహిళా నేతలతో కలసి జాతీయ మీడియాతో మాట్లాడారు. మా భూములు ఇచ్చేది లేదంటూ 9 నెలలుగా మేము ధర్నాలు చేస్తున్నాం.
సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్, ఏ అధికారీ రాలేదు. కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో రావడంతో మా రైతులు తిరగబడ్డారు.అది సాకుగా చూపుతూ అరెస్టులు చేశారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితల వెంట బీఆర్ఎస్ నేతలు సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్, కోవా లక్ష్మి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రవీంద్రకుమార్, హరిప్రియ నాయక్ ఉన్నారు.
గిరిజనులపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటు. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది రైతులు అధికారులపై దాడి చేశారు. దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
-సత్యవతి రాథోడ్, మాజీమంత్రి
వారసత్వంగా వచ్చిన భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని అంటున్నారు. మా గిరిజనుల భూముల జోలికి రావొద్దు. బాధితులకు గిరిజనులమంతా సైన్యంగా అండగా నిలబడతాం.
-మాలోతు కవిత, బీఆర్ఎస్ మాజీ ఎంపీ
గిరిజనుల రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. మా ఇండ్లలో నివసించే హక్కు లేకుండా చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలి.
-గిరిజన సంఘాల నేతలు