బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం.. హుస్సేన్‌సాగర్ తీరాన ఠీవిగా నిలబడిన పాలనాసౌధం. దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపైనా నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం వాస్తుకోసం సచివాలయం గేట్లు మార్చే పనులు జరుగుతున్నాయి. పదేండ్ల నిర్మాణాత్మక పాలనకు, ప్రస్తుత ‘కూల్చివేతల’ పాలనకు మధ్య ఎంత తేడా ఉన్నదో చెప్పకనే చెప్తున్నట్టుందీ చిత్రం.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డుపక్కన ఉన్న రెండు దుకాణాలను తొలగించారు. 40 ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నామని, ఇప్పుడు కూల్చేస్తే తామెలా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇందిరాల రాంబాబు ఇలా జేసీబీకి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు.
కుళ్లిన కూరగాయలు రోడ్డుపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు రూ.200 ఫైన్ వేశారు. మళ్లీ చెత్త వేస్తే పదివేలు జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆ మాటలతో వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. దవాఖానకు తరలించే లోపే గుండెపోటుతో మరణించింది.