Bandi Bhageerath | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): తన కొడుకు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వయస్సుపై నెలకొన్న సందేహాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెరదించారు. బాధిత బాలిక మైనరేనని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన కొడుకుపై నమోదైన పోక్సో కేసులో తన పరువు ప్రతిష్టలకు భంగం కల్పించే విధంగా మీడియాలో జరుగుతున్న ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ బండి సంజయ్ హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్లో తన కొడుకుపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన నేపథ్యాన్ని వివరించారు. ఉమ్మడి స్నేహితుల ద్వారా బాలికతో తన కుమారుడికి పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ తరువాత వారిద్దరి మధ్య స్నేహం పెరిగిందని, ఇతర స్నేహితులతో కలిసి తిరిగేవారని తెలిపారు. ఇప్పుడు ఈ అంశం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకాలం బాధిత బాలిక మైనర్ కాదంటూ ఎన్నో జిమ్మిక్కులు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తూ వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. స్వయంగా తన పిటిషన్లో ఆమె మైనరేనని పేర్కొనడం సంచలనంగా మారింది. నిజాన్ని ఎన్నాళ్లో దాచిపెట్టలేరని, ఎప్పుడో ఓసారి నిజం బయటకు వస్తుందని, స్వయంగా మంత్రే బాధితురాలు మైనర్ అని చెప్పిన తరువాత పోలీసులు ఏమి చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మరో పక్క బాలిక మైనర్ కాదంటూ బీజేపీ సోషల్‌మీడియా, బండి సంజయ్ వర్గం బాధితురాలికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు, ఫొటోలు, వీడియోలు వైరల్ చేశారు. ఇప్పుడు స్వయంగా బండి సంజయ్ మైనర్ బాలికతో తన కొడుకు స్నేహం కొనసాగించాడనే నిజాన్ని వెల్లడించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. బాధితురాలి జనన ధ్రువీకరణపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసులు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వైద్య విభాగానికి చేరుకొని జీహెచ్ఎంసీ అధికారులు జారీచేసిన బాధితురాలి జనన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించారు.
అది వాస్తవమైన పత్రమేనని నిర్ధారించుకున్న అనంతరం సర్కిల్ కార్యాలయంలోని రికార్డులు సైతం పరిశీలించారు. అంతేగాకుండా బాధితురాలు జన్మించిన దవాఖానలోని రికార్డులనూ వారు పరిశీలించారు. దవాఖాన, జీహెచ్ఎంసీ రికార్డులను సరిచూసిన తర్వాత బాలికను మైనర్‌గా పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది.