హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయింపులకు నిధుల కొరత ఏర్పడింది. జల్‌జీవన్ మిషన్, పీఎంఏవై, కృషి సించాయి యోజన, పీఎం పోషణ తదితర పథకాలతోపాటు రైల్వేలు, రహదారులు, ఎయిమ్స్ వంటి వాటికి రాష్ట్రవాటా నిధులు చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్ర ఖజానా నిండుకోవడంతో రేవంత్ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఆర్థికశాఖపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. కేంద్రం నుంచి వీలైనన్ని గ్రాంట్లు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. వివిధ శాఖలు, పథకాల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్‌ని 100% సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే, కేంద్రం తన వంతు ఇచ్చే వాటా నిధులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దని సర్కారు భావిస్తున్నది. రాను న్న బడ్జెట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కోరి న ఆర్థికశాఖ.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలుచేయగలిగిన కేంద్ర పథకాలను అన్ని శాఖలు గుర్తించాలని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడతగా కేంద్ర పథకాల అమలు కోసం రాష్ట్ర వాటాగా రూ.1000-1200 కోట్లు విడుదల చేస్తే, 6,000 కోట్ల వరకు కేంద్ర నిధులు ఇచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 26లోగా మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని కేంద్రం గడువు విధించినట్టు తెలిసింది. రెండ్రోజులే గడువు ఉండగా, రాష్ట్ర వాటా ఇద్దామనుకుంటే ఖజానా నిండుకున్నది. సంక్రాంతి నుంచి రైతుభరోసా అమలుచేయాలని సర్కారు భావిస్తున్నది. ఇప్పుడు ఆ నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌కు చెల్లించి కేంద్రం నుంచి వచ్చే నిధులను రైతుభరోసా పథకానికి మళ్లించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొదటి ఏడాదిలోనే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రేవంత్ సర్కారు ఆపసోపాలు పడుతుండడం గమనార్హం.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఐదు మెగావాట్ల నుం చి రెండు మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు, రైతు బృందా లు, సహకార సంఘాలు, ఎఫ్‌పీవోలు అసోసియేషన్లు ఈ పథకం కింద టీజీరెడ్కోకు దరఖాస్తు చేసుకోవచ్చని భట్టి వెల్లడించారు.